ప్రభుత్వం ప్రైవేటు భూముల డీలర్ కాదు- ఎపి, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు చేసిన వ్యాఖ్య ఇది.తెలంగాణ ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల నిమిత్తం భూములు సేకరించడానికి జారీ చేసిన జి.ఓ. 123 ని కొట్టివేసిన సందర్భంలో జడ్జి సురేష్ కుమార్ చేసిన వ్యాఖ్య ఇది.ఇది అన్ని ప్రభుత్వాలకు వర్తిస్తుంది.కాకపోతే హైకోర్టులు అనండి,సుప్రింకోర్టు అనండి.. ఒక్కోసారి ఒకే తరహా కేసులలో భిన్నమైన తీర్పులు ఇస్తున్నాయన్న అబిప్రాయం ఉంది.
ఎపిలో భూముల సేకరణ తీరు సందర్భంగా కోర్టులలో వచ్చిన నిర్ణయాలకు, వ్యాఖ్యలకు , తెలంగాణలో వివాదాలపై వచ్చిన నిర్ణయాలకు,వ్యాఖ్యలకు తేడా కనిపిస్తోందన్న అబిప్రాయం కొందరిలో కలుగుతోంది.ఈ కేసుతో, ఈ తీర్పు ఇచ్చిన జడ్జిగారికి సంబందం లేకపోయినా కొన్ని విషయాలు ఈ తరుణంలో సహజంగానే ప్రస్తావనకు వస్తాయి.హైకోర్టు తెలంగాణలో భూమి సేకరణ సందర్బంగా చేసిన అబ్జర్వేషన్ ను పరిగణనలోకి తీసుకోవలసిందే. 2013 చట్టానికి అనుగుణంగానే ఏ రాష్ట్రం అయినా భూములు సేకరించాలి. లేదా తదనుగుణంగానే కొత్త జిఓలు తేవాలి.తెలంగాణ జిఓలో భూమి లేని కూలీలకు సంబందించి ఎలాంటి ఉపశమనం లేదన్న కారణంగా జీఓను కొట్టివేస్తూ హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది
తెలంగాణ లో ఈ జిఓను కొట్టివేసిన హైకోర్టు గతంలో ఎపికి సంబందించిన కొన్ని భూమి వివాదాలలో భిన్నంగా స్పందించిందన్న భావన కొందరిలో వ్యక్తం అవుతోంది.కొంతమందికి వ్యక్తిగతంగా భూ సమీకరణపై స్టే ఇచ్చి ఉండవచ్చు.కాని మొత్తం భూ సమీకరణ విధానాన్ని న్యాయ వ్యవస్థ తప్పు పట్టినట్లు కనిపించలేదు.అక్కడ ప్రభుత్వం అచ్చంగా రియల్ ఎస్టేట్ మాదిరి కధ నడుపుతున్నా కోర్టుల నుంచి ఆ ప్రభుత్వానికి పెద్ద ఇబ్బంది రాకపోవడం ఆశ్చర్యంగానే ఉంటుంది.అంతెందుకు హైదరబాబాద్ లో అక్రమ కట్టడాలపై ఒకటికి,రెండుసార్లు సీరియస్ అయిన హైకోర్టు ఎపిలో కృష్ణా నది వెంట ఉన్న అక్రమ కట్టడాలపై కొందరు కోర్టుకు వెళితే మీకేమి సంబందం అని తోసిపుచ్చినట్లు వార్తలు వచ్చాయి.అందుకు హైకోర్టు కు కారణాలు ఉండవచ్చు.కాని సామాన్యులకు మాత్రం ఇలా జరిగిందేమిటన్న ప్రశ్న వస్తుంది.
భూ సమీకరణ పేరుతో వేలాది ఎకరాలను ఎపి ప్రభుత్వం సేకరించి రియల్ ఎస్టేట్ వెంచర్ లా మార్చిందన్న విమర్శలు తీవ్రంగా ఉన్నా,వారికి కోర్టుల నుంచి పెద్ద సమస్య ఎదురు కావడం లేదు.తెలంగాన ప్రభుత్వం నిమ్జ్ (పారిశ్రామిక జోన్ )భూముల సేకరణ కేసులో 123 జిఓను కొట్టివేసింది.
హైకోర్టు చెప్పినట్లు ఎపిలో అయినా, తెలంగాణలో అయినా ప్రభుత్వాలు ప్రైవేటు భూములకు డీలర్లుగానో, రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలగానో మారితే అవి ప్రజా ప్రభుత్వాలు అనిపించుకోవు.
http://kommineni.info/articles/dailyarticles/content_20160806_10.php?p=1470456759354