రాష్ట్రంలో సంభవిస్తున్న పరిణామాలు ప్రధానంగా వెలుగుచూస్తున్న అధికారపార్టీ నేతల అవినీతి పురాణాలు పరిశీలిస్తుంటే తెలుగుదేశం పార్టీపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టుకోల్పోతున్నారని పిస్తోంది. ఏ పార్టీ అయినా దాని అంతర్గత విషయాలు ఇతరులకు అక్కర్లేదు. కానీ, ప్రజా జీవితానికి సంబంధించి వెలుగుచూస్తున్న సంఘటనలు ప్రజలకు జవాబుదారీగా ఉంటాయి. అందుకే తెలుగుదేశం పార్టీ నేతల అవినీతి ఆరోపణలు చర్చనీయాంశ మయ్యాయి. రాష్ట్రంలో రైల్వే లైన్ల నిర్మాణమే అంతంత మాత్రం. అరకొరగా సాగే పనుల్లో తెలుగుదేశం నేతలు దందాలు సాగిస్తే పురోగతి చెప్పవీలులేదు. తాజాగా వెంకటగిరి ఎమ్మెల్యే దందా రచ్చకెక్కింది. మరోవైపు జాతీయస్థాయిలో ఏ సంఘటన జరిగినా ముఖ్యమంత్రికి గతంలో లాగా స్పందించే పరిస్థితి లేదు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ముఖ్యమంత్రిని దీక్షాదక్షుడుగా కీర్తించినా ఇది రాజకీయ గారడీ మాత్రమే. ఇదే నిజమై ఉంటే ప్రత్యేక హోదాగానీ, హోదాకు మించిన ప్యాకేజీ గాని, దాని సమగ్ర స్వరూపం గానీ కేంద్ర ప్రభుత్వం అధికారయుతంగా ప్రకటించి ఉండేది. ఈరోజు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్తున్న రూ.2.25 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటన ఆనాడు రాజ్యసభలో వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా కావాలని చేసిన డిమాండుకు మించి విలువ ఉందా? ఈ రెండింటికీ చట్టబద్ధత లేదు. ఒకవేళ ఉన్నా అమలు జరిగే అవకాశాలు అంతకన్నా లేవు. కేంద్ర బిజెపి ప్రభుత్వం పకడ్బందీగా ముఖ్యమంత్రిని చాకచక్యంగా తన బాహుబంధంలో ఇరికించుకొని ఎటూ కదలలేని, ఏమీ మాట్లాడలేని అస్తవ్యస్థ పరిస్థితిని సృష్టించింది.
మరో వైపు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగులేదు. పార్టీ నేతలపై వరుసపెట్టి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ముఖ్యమంత్రి ప్రేక్షక పాత్రవహిస్తున్నారు. సదావర్తి భూముల వ్యవహారంలో ప్రతిపక్ష పార్టీ రాజకీయంగా ఆరోపణ చేస్తున్నదనే సాకుతో కథను కంచికి పంపినా ప్రజల హృదయాల నుంచి మాత్రం తొలగించలేకపోయారు.
అదే విధంగా అగ్రీగోల్డ్ మదుపుదారుల క్షోభ వర్ణనాతీతం. ఈరోజు హైకోర్టు జోక్యం చేసుకుంది కాబట్టి కొద్దిమేరకైనా న్యాయం జరిగే అవకాశముంది. ఇందులో కొందరు పార్టీ నేతల చేతులకు మట్టి అంటింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఒక భాగమైన సిఐడి వ్యవహార సరళిపై హైకోర్టు పలు సందర్భాల్లో వేసిన అక్షింతలు ప్రభుత్వ నేతలకు సంబంధం లేదా?
ఇటీవల రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక నేత కుమారుడు, ఆయన అనుచరులు ఒక రైల్వే కాంట్రాక్టర్‌ను బెదిరించారనే అంశం ఢిల్లీ వరకు వెళ్లినట్లు ప్రచారం జరిగింది. ఇది వాస్తవం కావచ్చు, కాకపోవచ్చు. అయితే తదుపరి ఇందుకు సంబంధించి ఎవరి నుంచీ స్పందన లేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా ఒక రైల్వే కాంట్రాక్టరును బెదిరించి రూ.5 కోట్లు డిమాండు చేసినట్లు మీడియా కోడైకూస్తోంది. సదరు కాంట్రాక్టు సంస్థ ప్రతినిధి పత్రికల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ఈ రెండు సంఘటనలు ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిపాయి. ఈరోజు రాష్ట్రంలో దాదాపు అన్ని నియోజక వర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏదో ఒక తరహాలో ఇలాంటి దందాలు సాగిస్తూనే ఉన్నారు. అయితే ఇదంతా గోప్యంగా సాగిపోతోంది. ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేపై సదరు కాంట్రాక్టు సంస్థ నేరుగా పత్రికలకే ఎక్కిందంటే దీనికి బలమైన సాక్ష్యాలు ఉండవచ్చు. రెండు నెలల క్రితం ఇదే ఎమ్మేల్యే ఒక టీవీ చానల్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో విధ్వంసం సృష్టించిన సంఘటన లక్షలాది మంది ప్రేక్షకులు వీక్షించడమే కాకుండా, ఆ క్లిప్పింగులు వాట్సాప్, ఫేస్బుక్ లాంటి సమాచార మాధ్యమాల్లో ఈనాటికీ హల్చల్ చేస్తున్నాయి.
టీవీ చానల్లో రభస సృష్టించిన తదుపరి ముఖ్యమంత్రి గానీ, పార్టీ అధిష్టాన వర్గం గానీ ఆ సందర్భంలో బహిరంగంగా ఆ ఎమ్మెల్యేను మందలించి ఉంటే ఆనాడు పరాకాష్టగా పార్టీ పరువు బజారుకెక్కేది కాదు. ఇంతటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ అంశంపై తెలుగుదేశం పార్టీలోనూ, బయటా రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయడం భారీ వ్యయంతో కూడుకొని ఉన్నందున గత ఎన్నికల్లో చేసిన అప్పులు తీర్చుకొనేందుకు, రానున్న ఎన్నికల్లో నిధులు వ్యయం చేసేందుకు అనువుగా ముఖ్యమంత్రి పార్టీ నేతల పగ్గాలు వదిలిపెట్టారనే ప్రచారం లేకపోలేదు. దీనికితోడు ఎన్నికల్లో చేసిన హామీలు అమలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఐదు నెలలు గడిచిందో లేదో రూ.8,500 కోట్లు అప్పు చేయవలసి వచ్చింది. రాష్ట్రంలో క్రమేణా ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. ప్రజా వ్యతిరేకతకు దర్పణంగా ఈ రెండేళ్ల కాలంలో ఎట్టి ఎన్నికలూ జరగలేదు. ఉప ఎన్నికలు అధికార పార్టీకి ఎప్పుడూ అనుకూలంగా ఉన్నా రానున్న మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల ఎన్నికలు తెలుగుదేశం భవిష్యత్తుకు గీటురాయిగా ఉండబోతున్నాయి. ప్రజలు భరించలేమని భావిస్తే గొంగళి పురుగునైనా కౌగలించుకుంటారు. అంతర్గత పరిస్థితికి తోడు ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి గీటురాయిగా ఉండబోతున్నాయి.
2014 తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నవి ప్రక్కన పెట్టగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఊతకర్రలుగా ఉన్న మీడియాలో గతంలో వచ్చిన వార్తలు ప్రజల మది నుంచి ఎవరూ తొలగించలేరు. మంత్రులు, వారి భార్యలు, సుపుత్రులు, సోదరులు సాగించిన దందా ఒక మీడియా వరుసబెట్టి కథనాలు ప్రకటించి మధ్యలో ఎందుకో ఫుల్స్టాప్ పెట్టింది. మరో మీడియా అయితే నిత్య క్షామపీడిత ప్రాంతమైన అనంతపురం జిల్లాలో వెనకేసుకున్నట్లు కథనం ప్రకటించింది. తుదకు తెలుగు తమ్ముళ్లను అదుపు చేయలేని ముఖ్యమంత్రి ఇసుక పంపిణీ విధానమే మార్చేశారు. తెలుగుదేశం రాజ్యసభ సభ్యునికి చెందిన ఒక కాంట్రాక్టు సంస్థ ఎలాంటి పరిపాలనా అనుమతులు లేకుండానే రూ.60 కోట్లు బిల్లు చేసుకున్నట్లు ఇదే మీడియా ఒక కథనం ప్రకటించింది. ప్రస్తుతం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెబుతున్నట్లు ఇవన్నీ కూడా పాచిపోయిన లడ్డూలాగా పాత వార్తలే అయినా గత రెండేళ్ళ తెలుగుదేశం పరిపాలనలో పారదర్శకతకు ఇవి చిహ్నంగా ఉన్నాయి. ఇవి పాచిపోయిన వార్తలే అయినా ఇవి వెదజల్లే దుర్గంధం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు, ముఖ్యమంత్రి తరచూ చెప్పే పారదర్శకతకు దర్పణంగా ఉండబోతున్నాయి.
ఎన్నికల సందర్భంలోనూ, పాదయాత్ర సందర్భంలోనూ దేశం అధినేత అయాచితంగా ఇచ్చిన హామీలే నేడు ముప్పిరిగొంటున్నాయి. ప్రాంతాల మధ్య అసమానతలు పెంచే విధంగా ప్రభుత్వ వ్యవహార శైలి ఉన్నందున్న స్థానిక ప్రజల ఆగ్రహంతో పాటు ఆయా ప్రాంతాల్లో బలీయంగా ఉన్న ఆయా కులాలకు చెందిన అధికార పార్టీ నేతలు తాము ఎంతకు తెగించినా తమపై వేటు వేయలేరనే ధీమాతో ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా గట్టిగా ఎవరిపైనా చర్య తీసుకోవడం లేదు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు రోజుకో కొత్త పథకం ప్రకటించడం, కరువు, దోమలపై యుద్ధాలంటూ సమాయత్తం కావడం, ఉదయం నుంచి అర్థరాత్రి వరకూ సమావేశాలు, టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించి తను నిత్యశ్రామికుడనని ప్రకటించుకోవడం ద్వారా తన వ్యక్తిత్వంతోనైనా పార్టీపై పడుతున్న మచ్చను తుడిచి వేసేందుకు ముఖ్యమంత్రి విఫలయత్నం చేస్తున్నారు.
రాష్ట్రంలో వెల్లువెత్తుతున్న అవినీతిపై ప్రధాన ప్రతిపక్షం, వామపక్షాలు చేస్తున్న ఆరోపణలకు తోడు రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్న బిజెపి కూడా రహస్యంగా చెవులు కొరుక్కోవడంతోపాటు ఒక్కోసారి బహిరంగంగా విమర్శలు చేస్తున్నది. పైగా తమ జాతీయ నాయకత్వానికి ఇదంతా చేరవేస్తున్నట్లు కూడా చెప్తున్నారు. రాష్ట్ర బిజెపి నేతలు చేరవేసే సమాచారం అటుంచగా ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుందో క్షణాల మీద కేంద్రానికి సమాచారం చేరవేసే వ్యవస్థ ఉండనే ఉంది.
(వి శంకరయ్య -విశ్రాంత పాత్రికేయుడు
9848394013 )
Mana Kulam Kamma ga vunta chalu …
AP ala potha manaku andhuku ??
Neethimalina Jathi …..Siggumalina panulu.
http://www.sakshi.com/news/top-news/union-minister-venkaiah-naidu-coments-on-ap-special-status-406040?pfrom=inside-featured-stories