వెస్ట్ గోదావరి లో 15 స్థానాల్లో10 చోట్ల టీడీపీ కి ఎదురు గాలి

వెస్ట్ గోదావరి లో 15 స్థానాల్లో10 చోట్ల టీడీపీ కి ఎదురు గాలి
ప‌శ్చిమాన ప‌సుపు ప‌తాక వెత‌లు..!
ఏపీలో అన్ని జిల్లాలు ఒక ఎత్తయితే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా వ్య‌వ‌హారం మ‌రో ఎత్తు. వాస్త‌వంగా చంద్ర‌బాబు మ‌రో సారి సీఎం కావ‌డంలో ఈ జిల్లా అందించిన చేయూత అంతా ఇంతా కాదు. గోదావ‌రి జిల్లాలు లేకపోతే చంద్ర‌బాబుకి పీఠ‌మే ద‌క్క‌క‌పోయేది. ఉభ‌య గోదావ‌రి జిల్లా వాసుల ఓట్ల‌తోనే బాబు ఇప్పుడు అధికారంలో కొన‌సాగుతున్నారు. మొత్తం రెండు జిల్లాల్లో క‌లిపి 34 స్థానాలు ఉంటే బాబు అండ్ కో అందులో 29 స్థానాలు సాధించారు. రాష్ట్రం మొత్తం మీద టీడీపీ ఆధిక్యం దానిక‌న్నా త‌క్కువే కావ‌డం విశేషం. అందులోనూ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా అయితే ఏకంగా ప్ర‌తిప‌క్షానికి బోణీ లేని ప‌రిస్థితి.

అదంతా 2014 నాటి ప‌రిస్థితి. రెండున్న‌రేళ్ల‌య్యింది. చంద్ర‌బాబు అభిమాన జిల్లాలో ఇప్పుడు ప‌రిస్థితి బూమ‌రాంగ్ అయ్యింది. మొత్తం సీన్ రివ‌ర్స్ అయిన‌ట్టే క‌నిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఈసారి ప‌సుపు జెండా ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌ర‌మే అన్న‌ట్టుగా మారిపోతోంది. ఉదాహ‌ర‌ణ‌కు న‌ర్సాపురం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిస్థితి చూస్తే అక్క‌డ ఎమ్మెల్యే బండారు మాధ‌వనాయుడు వ‌సూళ్ల ప‌ర్వం భ‌రించ‌లేకోతున్నామ‌ని జ‌నం గ‌గ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా ఆ ఎమ్మెల్యే సోద‌రుడు ఏకంగా డిబ్బీ పెట్టేసిన‌ట్టు జ‌నం చెప్పుకునే వ‌ర‌కూ వ‌చ్చేసింది. ఒక పాల‌కొల్లు ఎమ్మెల్యే రామానాయుడిని డ్రామా నాయుడుగా వ‌ర్ణించే వారు ఎక్కువ‌య్యారు. ప్ర‌చారం కోసం ఏమైనా చేస్తారు తప్ప ప్ర‌జ‌ల కోసం ప‌నిచేయ‌డం లేద‌నే వాద‌న బ‌ల‌ప‌డుతోంది. భీమ‌వ‌రం ఎమ్మెల్యే పుల‌ప‌ర్తి రామాంజ‌నేయుల‌కు జ‌నంతో పెద్ద‌గా ప‌ని ఉన్న‌ట్టు లేదు. రెండో సారి ఎమ్మెల్యే కావ‌డంతో పూర్తిగా అధికారం మ‌త్తు ఎక్కిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇక ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఇప్పుడు తుందుర్ర ఆక్వాఫుడ్ పార్క్ వ్య‌వ‌హారం పాల‌క‌పార్టీ పీక‌ల మీద‌కొచ్చింది. ప్ర‌త్య‌క్షంగా 34 గ్రామాలు, ప‌రోక్షంగా మ‌రో 50 గ్రామాల వ‌ర‌కూ ఆ ఆక్వాపార్క్ ప్ర‌భావం ఉంటుంద‌ని భావిస్తున్నారు. దాంతో ఏక‌కంఠంతో సుమారు రెండు ల‌క్ష‌ల మంది జ‌నాలు టీడీపీకి త‌మ తడాఖా చూపిస్తామ‌ని చెబుతున్నారు. దాంతో మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ సైకిల్ కి ఆశ‌లు లేవ‌నే చెప్ప‌వ‌చ్చు.

ఇక కొవ్వూరు, నిడ‌ద‌వోలు, గోపాల‌పురంలో ప‌రిస్థితి మ‌రో విధంగా ఉంది. అందులో సీనియ‌ర్ ఎమ్మెల్యేగా ఉన్న నిడ‌ద‌వోలు శేషారావు స‌హా మిగిలిని ఇద్ద‌రు కొత్త ఎమ్మెల్యేలు ఇసుకాసురులుగా మారిపోయిన‌ట్టు నియోజ‌క‌వ‌ర్గ‌మంతా కోడై కూస్తోంది. పేరుకి ఉచిత ఇసుక అంటున్న‌ప్ప‌టికీ జ‌నం జేబులు కొల్ల‌గొట్ట‌డంలో ఈ పెద్ద మ‌నుషులు పెద్ద పాత్ర‌నే పోషిస్తున్నారు. కొవ్వూరులో ఇసుక త‌గాదా మూలంగా ఓ టీడీపీ నేతే హ‌త్య‌కు గురికావ‌డం ప‌రిస్థితికి అద్దం ప‌డుతోంది. ఒక పోల‌వ‌రం, చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంపీ మాగంటి బాబుకి అక్క‌డి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంత్రి సుజాత‌, ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ కి ఏమాత్రం పొస‌గ‌డం లేదు. పార్టీ రెండు వ‌ర్గాలుగా విడిపోయి బాహాటంగానే ఆధిప‌త్య పోరు సాగిస్తున్నారు.. ఇక చింత‌ల‌పూడి సంగ‌తి చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఏలూరు, ఉంగుటూరు ఎమ్మెల్యేల‌కు చాలాకాలానికి ఒక ప‌ద‌వి రావ‌డంతో వ్య‌వ‌హారం ఓ స్థాయిలో న‌డుస్తోంది. ఉండిలో శివ కూడా విశ్వ‌రూపం చూపిస్తున్న‌ట్టు తెలుస్తోంది. తాడేప‌ల్లిగూడెంలో మంత్రి మాణిక్యాల‌రావు కి, టీడీకీ మ‌ధ్య బ‌హిరంగ‌యుద్ధ‌మే న‌డుస్తోంది. త‌ణుకు ఎమ్మెల్యే సింగ‌పూర్ చూపిస్తాన‌ని చెప్పి క‌నీసం సిరిపురం కూడా చేయాలేక‌పోయార‌ని జ‌నాభిప్రాయం. ఆచంట‌లో సీనియ‌ర్ ఎమ్మెల్యే పితాని మాట పార్టీలోనే వినేవాళ్లు లేరు. ఆయ‌న కూడా పూర్తిగా సైకిల్ మీదే ఉంటార‌ని చెప్ప‌లేని ప‌రిస్థితి.

మొత్తంగా 15 స్థానాల‌కు గాను ఇప్పుడు 10 చోట్ల ఎదురుగాలి క‌నిపిస్తోంది. ఇక జ‌న‌సేన తోడు కూడా లేక‌పోతే మొత్తం అన్ని చోట్లా ఆశాభంగం ఎదుర‌వుతుంద‌ని అంటున్నారు అందుకు కార‌ణం కూడా చంద్ర‌బాబే అన్న‌ది అంద‌రి మాట‌. ఎమ్మెల్యేల‌ను నియంత్రించ‌లేక‌పోవ‌డం, ఇచ్చిన హామీల‌ను తుంగ‌లో తొక్క‌డం ప‌శ్చిమంలో ప‌సుపు ప‌తాకం ఇప్పుడు తిరోగ‌మ‌నంలో సాగుతోంది.

http://telugu.updateap.com/politics/tdp-loosing-base-in-west-godavari/

1 Comment

Filed under Uncategorized

One response to “వెస్ట్ గోదావరి లో 15 స్థానాల్లో10 చోట్ల టీడీపీ కి ఎదురు గాలి

 1. Veera

  ఇలపావులూరి మురళీ మోహన రావు
  ఒక చరిత్ర – కొన్ని నిజాలు – 15 వ భాగం మీద నిన్న చేసిన విశ్లేషణ పై విశ్లేషణ – ఒకటో భాగం
  ****
  నిన్న రాత్రి పోస్ట్ చేసిన డాక్టర్ దగ్గుబాటి పుస్తకం లోని ఒక భాగం ను చదివిన డాక్టర్ దగ్గుబాటి ఇవాళ మధ్యాహ్నం ఫోన్ చేసి కొన్ని వివరణలు ఇచ్చారు. విశ్లేషిస్తున్న విధానం బాగున్నది అంటూ, దీనిపై వస్తున్న విజ్ఞుల కామెంట్స్ కూడా చాలా అర్ధవంతంగా ఉంటున్నాయని ప్రశంసించారు. దాదాపు గంటసేపు జరిగిన సంభాషణ కాబట్టి నేను కూడా వారిని అనేక ప్రశ్నలు వెయ్యడం, వారు చాలా సహనం తో జవాబులు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క ప్రశ్నకూ తడుముకోవడం, తప్పించుకోవడం, జవాబు దాటవేయడము గాని జరగకపోవడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అంతే కాదు… చంద్రబాబు అభిమానులు కూడా ఆశ్చర్యపోయే సమాధానాలు ఇచ్చారు! ఈ సంభాషణ పై విశ్లేషణ కేవలం నా జ్ఞాపక శక్తి మీదే ఆధారపడి ఉండటం వలన ఒకటి రెండు వాక్యాలు మిస్ అయినా, లేక అదనంగా కలిసినా 99 శాతం వరకూ యధాతదం అని చెప్పగలను. ముందుగా డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు గారు అంత సమయం వెచ్చించినందుకు వారికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
  ****
  నేను – చంద్రబాబు తిరుగుబాటు లో మీరు ఎందుకు పాలు పంచుకున్నారు? మీకు ఏమి ఆశలు పెట్టారు?
  డాక్టర్ – వివరంగా చెప్తాను. చంద్రబాబు తిరుగుబాటు జరిగిన రోజున నేను ఢిల్లీ లో ఉన్నాను. చంద్రబాబు నాకు ఫోన్ చేసి సహకరించమని కోరాడు. నేను బదులు ఇవ్వకుండా సాయంత్రం హైద్రాబాద్ వస్తున్నాను అని చెప్పాను. అప్పుడు నేను 80-90 మంది ఎమ్మెల్యేలతో ఫోన్ లో మాట్లాడాను. అప్పటికే అందరూ చంద్రబాబు వైపు మొగ్గు చూపారు అని, వారి బాడీ లాంగ్వేజ్ ను బట్టి అర్ధం అయింది. నేను హుటాహుటిన హైద్రాబాద్ విమానం లో బేగంపేట్ లో దిగాను. అప్పటికే నలభై మంది శాసనసభ్యులు విమానాశ్రయం లో నాకోసం ఎదురు చూస్తున్నారు. వారంతా నాకు బాగా పరిచయస్తులు. వారిలో చాలామందికి నేనే టికెట్స్ ఇప్పించాను. దాదాపు నన్ను చుట్టుముట్టారు. ఎన్టీఆర్ పై తిరుగుబాటు జరిగిందని, మెజారిటీ ఎమ్మెల్యేలు చంద్రబాబు వైపు ఉన్నారని, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు కూడా చంద్రబాబు ను సమర్ధిస్తున్నారని, మీరు కూడా రావాలని పట్టు పట్టారు. నాకేమీ తోచలేదు. ఒకటి మాత్రం అర్ధం అయింది. పరిస్థితి అప్పటికే చేయి దాటిపోయింది అని. నేను ఏమి చెప్పినా వారు వినే పరిస్థితి లో లేరు.
  నేను హోటల్ కువెళ్లకుండా నేరుగా ఇంటికి వెళ్లాను. అప్పటికే అక్కడ హరికృష్ణ, బాలకృష్ణ మరికొందరు ఎమ్మెల్యేలు, జయప్రకాష్ నారాయణ, సీఎం రమేష్, ఐజి దుర్గా ప్రసాద్, యార్లగడ్డ, మరికొందరు ఉన్నారు. జరిగిన విషయం నాతో చెప్పి నన్ను వైస్రాయ్ హోటల్కు రావలసిందిగా కోరాడు.
  అప్పుడు నాకు గతం లో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మంత్రులందరినీ డిస్మిస్ చేసినపుడు ఒక తిరుగుబాటు జరిగింది. ఇది ప్రచారం లోకి రాలేదు. ఆ సమయంలో నేను కల్పించుకుని తిరగబడ్డ వారిని సముదాయించి మళ్ళీ ఎన్టీఆర్ వైపు మళ్లించగలిగాను.
  ఇప్పుడు ఎన్టీఆర్ దగ్గరకి వెళ్లేకంటే తిరుగుబాటుదారుల వైపే వెళ్లి వారిని అనునయించి మళ్ళీ వారిని ఎన్టీఆర్ వైపు మళ్లించవచ్చు అని ఆలోచించాను. అయితే ఈ తిరుగుబాటు సఫలం కాదు అని, నేను వెళ్లి సర్దిచెపితే అందరూ చంద్రబాబు తో సహా మనసులు మార్చుకుని ఎన్టీఆర్ దగ్గరకు వస్తారని ఆశించాను. అందుకే నేను హోటల్ కు వెళ్లాను. కానీ అక్కడ జరిగింది మొత్తం పకడ్బందీ గా జరిగింది.

  నేను – మీకు మంత్రి పదవి ఇచ్చినట్లయితే తిరిగి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లేవారేనా?
  డాక్టర్ – నేను అసలు మంత్రి పదవిని అడగనే లేదు. నేను వెళ్ళింది తిరుగుబాటుదారుల మనసు మార్చవచ్చు అనే ఉద్ద్యేశ్యం తోనే. కానీ ఆనాడు పత్రికలన్నీ చంద్రబాబుకు అనుకూలంగా ఉండటం తో ప్రచారం మరోవిధంగా సాగింది.

  నేను – మరి మీరు పదిరోజులు తిరక్కుండానే ఎన్టీఆర్ వైపుకు రావడానికి కారణం?
  డాక్టర్ – ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు వైఖరి పూర్తిగా మారిపోయింది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పువ్వాడ నాగేశ్వర్ రావు చంద్రబాబు ను కలిసినపుడు ‘మీ తోడల్లుడు కు పదవి ఎప్పుడు ఇస్తారు?’ అని అడిగాడు. “ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు” అని బదులిచ్చాడు చంద్రబాబు. దానికి తోడు చంద్రబాబు కు రాజగురువు అని పిలవబడే ఒక పత్రికా యజమాని సంపాదకీయం లో ‘ఎప్పటికైనా దగ్గుబాటి – చంద్రబాబు కు పక్కలో బల్లెంగా మారుతాడు” అని రాసాడు. దాంతో నాకు అసహ్యం వేసింది. అప్పటికే శాసనసభ్యలను తిరిగి తీసుకు వెళ్లాలనే నా లక్ష్యం నెరవేరదు అని రూఢి అయింది. ఆ క్షణం లో నాలో పశ్చాత్త్తాపం మొదలు అయింది. పెద్దాయనను మోసం చేసానా అని అంతర్మధనం మొదలయింది. ఎందుకంటే ఎన్టీఆర్ కుమార్తె నా భార్య అనే కాదు. నా సోదరి కూడా ఎన్టీఆర్ కోడలు. 1971 లో మాకు బంధుత్వం కలిసింది. అప్పుడు నేను టీనేజర్ ను. అప్పటినుంచి ఎన్టీఆర్ ఇంట్లో మెంబర్ లా ఉంటూ ఉండేవాడిని. ఎన్టీఆర్ అప్పుడు సూపర్ స్టార్. అంత బిజీలోనూ నన్ను నవ్వుతూ పలకరించేవారు. అటువంటి వ్యక్త్రికి ద్రోహం చేసినందుకు నేను మనసులో కుమిలిపోయాను. నా బాధ కొందరు ఎమ్మెల్యేలతో చెప్పాను. పదహారు మంది స్పందించారు. వారిలో కొందరు మంత్రి పదవులు ఆశించారు. అవి రాకపోయేసరికి వాళ్ళు కుతకుత లాడిపోయారు. నేను వారిని సముదాయించి ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళిపోయాను.

  నేను – ఎన్టీఆర్ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు?
  డాక్టర్ – మమ్మల్ని చూడగానే ఆయన ఉద్వేగం పట్టలేక నన్ను కౌగలించుకుని లోపలకి తీసుకెళ్లారు. ఆ క్షణం లో ఎన్టీఆర్ ను చూసిన నాకు ఎంతో సిగ్గువేసింది. ఇక బ్రతికి ఉన్నంతవరకు ఎన్టీఆర్ తోనే ఉండాలని నిర్ణయించుకున్నాను.

  నేను – అసలు ఎమ్మెల్యేలు తిరుగుబాటు దేనికి చేశారు?
  డాక్టర్ – ఎన్నికలలో పోటీ చెయ్యడానికి బోలెడంత డబ్బు ఖర్చు చెయ్యాలి. ఓడిపోతే అంతా నష్టమే. గెలిస్తే ఐదేళ్లలో అంతా రాబట్టుకోవాలి. అంతే కాక మళ్ళీ ఎన్నికలలో పోటీ చెయ్యడానికి డబ్బు కావాలి. రాజకీయ అవినీతికి ఎన్టీఆర్ పూర్తిగా వ్యతిరేకం. ఏ ఎమ్మెల్యే, మంత్రి పైసా కూడా అవినీతి సొమ్ము సంపాదించ కుండా కట్టుదిట్టాలు చేశారు. ఎమ్మెల్యేలకు ఏమాత్రం ఆదాయం లేకుండా పోయింది. అలాంటి వారిని చంద్రబాబు గమనించాడు. వారిలో ఆశలు కల్పించాడు. ఎన్టీఆర్ చూసీ చూడనట్లు ఉండి ఉంటె ఇలా జరిగేది కాదు. దాంతో వారందరికీ ఎన్టీఆర్ అంటే వైముఖ్యం ఏర్పడింది. అవినీతి ఆదాయం లేకుండా రాజకీయాలలో కొనసాగడం దుర్లభం.
  $$$$$$$$$$$$$

  చంద్రబాబు అవినీతి ఫై, లక్ష్మీ పార్వతి, కల్వకుంట్ల తారకరామారావు, జూనియర్ ఎన్టీఆర్ మొదలగువారిపై మరియు నిన్న ఒక వ్యాఖ్యాత పెట్టిన కామెంట్ పై డాక్టర్ దగ్గుబాటి వెలిబుచ్చిన అభిప్రాయలు రేపు చూద్దాం.
  సశేషం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s