మీరు కొంచెం మారాలి బాబూ!
ప్రతిపాదిత అమరావతి నిర్మాణంపై అధిక ఫోకస్ చేయడం, చెబుతున్న మాటలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించకపోవడంతో ప్రజల్లో ముఖ్యమంత్రిపై నమ్మకం సన్నగిల్లుతోంది. కేసీఆర్ నిర్దేశించుకున్నట్టుగా చంద్రబాబు ప్రభుత్వం ప్రాధాన్యతలు నిర్దేశించుకోవడంలో విఫలమయ్యింది. అధికార యంత్రాంగంలో అలసత్వం, క్రమశిక్షణారాహిత్యం నెలకొనడంతో తలపెట్టిన పనుల్లో అంతగా పురోగతి కనబడటం లేదు. ప్రత్యేకహోదానా? ప్యాకేజీనా? అన్న మీమాంసతోనే ఏడాదికిపైగా గడిచిపోయింది. మధ్యలో కాపుల రిజర్వేషన్ ఆందోళన వంటి సమస్యలు చంద్రబాబు ప్రభుత్వానికి ప్రతిబంధకాలుగా తయారయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ బహిరంగంగాగానీ, విలేకరుల సమావేశంలోగానీ ఎప్పుడో ఒకసారి మాత్రమే మాట్లాడతారు. దీంతో ఆయన ఎప్పుడైనా మాట్లాడితే ఏమి మాట్లాడతారా? అన్న ఆసక్తి ఉంటోంది.
చంద్రబాబు విషయానికి వస్తే, ఆయన రోజూ ఎక్కడో ఒకచోట ఏదో ఒక రూపంలో మాట్లాడుతున్నారు. దీంతో ఆయన ప్రసంగాలు రొటీన్ అయిపోయాయి. టీవీలలో చంద్రబాబు ప్రసంగిస్తుంటే ఆసక్తిగా వినే పరిస్థితిలో ఇప్పుడు ఏపీ ప్రజలు లేరు.
నిజానికి ఆయన గొప్ప ఉపన్యాసకుడు కూడా కాదు. ఆయన ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకునేలా ఉండవు. అయితే, చంద్రబాబు పనితీరుపై నమ్మకంతోనే ప్రజలు ఆయనకు అధికారం అప్పగించారు. ఆయన ఉపన్యాసాలలో కొత్త విషయం ఏమీ ఉండదన్న అభిప్రాయం గతంలో కూడా ఉండేది.
చంద్రబాబు విషయంలో ప్రజల్లో ఆదరణ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి అక్కడ ఎన్నికలు జరగలేదు. ఏ సంస్థా సర్వేలు నిర్వహించలేదు. మరో రెండు మూడు నెలలలో మునిసిపాలిటీలకు జరగనున్న ఎన్నికల తర్వాతగానీ వాస్తవ పరిస్థితి ఎలా ఉందో తెలియదు. ప్రచారం విషయంలో కేసీఆర్‌తో పోల్చితే చంద్రబాబు బాగా వెనుకబడి ఉన్నారు. అదే సమయంలో చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడేవారి సంఖ్య కూడా అంతగా కనిపించడం లేదు. దీంతో చంద్రబాబుకు జనాదరణ తగ్గిందా? అన్న అనుమానం రాజకీయ పరిశీలకులలో ఏర్పడుతోంది. అయితే చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై పెదవి విరిచేవారు కూడా ప్రతిపక్షనాయకుడు జగన్మోహన్‌రెడ్డి వైపు మొగ్గుచూపడం లేదు. దీనినే గుడ్డికంటే మెల్ల నయం అంటారు కాబోలు. అయినా ఇప్పట్లో ఎన్నికలు రావు కనుక రెండున్నరేళ్ల తర్వాత జరిగే ఎన్నికలలో అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలంటే ఇరువురు ముఖ్యమంత్రులు ముఖ్యంగా చంద్రబాబు కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.
బాబు నేర్వని పాఠాలు..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకోవలసిన దిద్దుబాటు చర్యలు చాలా ఉన్నాయి. అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రికి మధ్య అంతరం ఏర్పడింది. ఈ కారణంగా ముఖ్యమంత్రి వ్యవహారశైలి పట్ల పలువురు సీనియర్ అధికారులు విసుగు ప్రదర్శిస్తున్నారు. తరచుగా సుదీర్ఘ సమీక్షలు నిర్వహించడం, ప్రతిరోజూ ఉదయం ఎనిమిదిన్నర నుంచి గంటపాటు టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తూ రావడంతో చంద్రబాబుపై అధికారులే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు చాలామంది అధికారులు హైదరాబాద్‌లోనే ఉన్నందున సమీక్షలు, సమావేశాల కోసం ఎక్కే విమానం, దిగే విమానం అన్నట్టుగా వారి పరిస్థితి ఉండేది. ఇప్పుడు టెలీకాన్ఫరెన్స్‌ల వల్ల తలపోటు వస్తోందని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ఉదయంపూట అందరికీ ఇళ్లల్లో ఏవో పనులు ఉంటాయి. సరిగ్గా అటువంటి సమయంలో గంటపాటు టెలీకాన్ఫరెన్స్ ఉండటం వల్ల ఇబ్బందిగా ఉంటోందనీ, అయినా ముఖ్యమంత్రి ఇచ్చే ఆదేశాలు, చేసే సూచనలు అమలు కావాలంటే కనీసం పదిహేను రోజుల వ్యవధి అవసరమనీ, ఆ వ్యవధి ఇవ్వకుండా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించడం వల్ల మొక్కుబడి తంతుగా మారిందనీ పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. మంత్రులు, శాసన సభ్యులు కూడా ఈ టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొనవలసి ఉంటోంది. దీంతో తమను కలవడానికి ఉదయంపూట వచ్చే సందర్శకులను కలుసుకోలేకపోతున్నామని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా చేసేది ఏమీలేదు కనుక సెల్‌ఫోన్‌లు ఆన్‌లో ఉంచి ఎవరి పనుల్లో వారు ఉండిపోతున్నారు.
టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొనలేకపోయిన అధికారులను సంబోధిస్తూ ముఖ్యమంత్రి కొన్ని సందర్భాలలో సూచనలు చేస్తూ ఉంటారు. మొత్తంమీద ఈ టెలీకాన్ఫరెన్స్‌ల వ్యవహారం చంద్రబాబుకు లాభించకపోగా, నష్టం చేస్తోందన్న అభిప్రాయమే అటు తెలుగుదేశం పార్టీ వర్గాలలో, ఇటు అధికార వర్గాలలో వినిపిస్తోంది.
రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన స్విస్ ఛాలెంజ్ విధానాన్నే తీసుకుందాం! ఈ అంశంపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రజలు శంకించే పరిస్థితిని కొనితెచ్చుకున్నారు. స్విస్ చాలెంజ్‌లో పాల్గొనే బిడ్డర్లు ఇవ్వజూపిన రెవెన్యూ వాటాను ఇతర బిడ్డర్లకు కూడా తెలియ చేయాలని చట్టంలో పేర్కొన్నారు. ఇక్కడ అధికారులు వాడిన ఒక పొరపాటు పదం వల్ల ప్రభుత్వం ఆత్మరక్షణలో పడవలసి వచ్చింది. అంతేకాకుండా మొత్తం ప్రాసెస్ మూడు నెలలు జాప్యం అవుతోంది.
రాజధానికి పెట్టుబడులు రావాలంటే రియల్ ఎస్టేట్ సంస్థల వల్ల జరగదు. అంతర్జాతీయంగా పేరు ప్రతిష్ఠలు ఉండి పెట్టుబడిదారులలో నమ్మకం కలిగించవలసిన సంస్థలకే అది సాధ్యం. ఈ విషయం అలా ఉంచితే, అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాకాలంపాటు తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను చంద్రబాబు గాలికి వదిలేశారు. ఒక్కరోజు కూడా పార్టీ కార్యాలయానికి వెళ్లలేదు. దీంతో పార్టీకీ ఆయనకూ మధ్య అంతరం పెరిగింది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా అనధికార పదవుల భర్తీ పూర్తిగా జరగలేదు. ఫలితంగా పార్టీ యంత్రాంగంలో నిరాశా నిస్పృహలు చోటుచేసుకున్నాయి. పాలనా వ్యవహారాలకే పరిమితమై రాజకీయ వ్యవహారాలను పట్టించుకోకపోవడం చంద్రబాబుకు నష్టం చేసింది. ప్రజాప్రతినిధుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడానికి కూడా ముఖ్యమంత్రి సుముఖత చూపడం లేదన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. దీంతో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను చెప్పడానికి మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ వెనుకాడుతున్నారు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించవలసి ఉంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా కాపులకు ఏటా వెయ్యికోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. రుణాల పంపిణీ కూడా మొదలయ్యింది. అయితే రుణాలు పొందినవారు ఆటోలు వగైరా కొనుక్కుని వాటిపై చంద్రబాబు ఫోటో కూడా ప్రదర్శించడం లేదనీ, పవన్‌కల్యాణ్ లేదా ముద్రగడ పద్మనాభం ఫొటోలు పెట్టుకుంటున్నారని గోదావరి జిల్లాలకు చెందిన ఒక ఎమ్మెల్యే చెప్పారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిపాదించిన మెగా ఆక్వాపార్క్ వివాదాస్పదం కావడం కూడా స్వయంకృతాపరాధమేనని చెప్పాలి. అధికార యంత్రాంగంతోపాటు పార్టీ యంత్రాంగంలో నిర్లిప్తత లేదా నిర్లక్ష్యం వల్ల గోటితో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్నట్టు అయ్యింది.
లోపాలు మరెన్నో ఉన్నప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితులలో ఏపీని నిలబెట్టగలిగేది చంద్రబాబు ఒక్కరేనన్న అభిప్రాయం ఇప్పటికీ చాలామందిలో ఉంది. అయితే 1995-1999 మధ్యకాలంలోవలె చంద్రబాబు తరఫున వకాల్తా పుచ్చుకుని ఆయన పనితీరును బహిరంగంగా శ్లాఘించేవారు ఇప్పుడు కరువయ్యారు.
తెలంగాణ ప్రజలతో పోల్చితే ఏపీ ప్రజల ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. వారిని సంతృప్తిపర్చడం అంత తేలిక కాదు. అదే సమయంలో, ఆ సమాజం కులమతాల ప్రాతిపదికన విడిపోయి ఉంది.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎదురుకాని ఎన్నో సమస్యలు చంద్రబాబు ముందున్నాయి. అక్కడ ప్రతిపక్షం కూడా బలంగా ఉంది. ఈ నేపథ్యంలో తనకున్న పరిమితులను దృష్టిలో పెట్టుకుని లక్ష్యాలను నిర్దేశించుకోవలసిన అవసరం చంద్రబాబుకు ఎంతైనా ఉంది. ఆకాశానికి నిచ్చెనలు వేయడం మానుకోవాలి. మిగిలిన రెండున్నరేళ్లలో ఎంత చేయగలరో, ఏమిచేయగలరో అంతే చెప్పడం మంచిది.
ప్రపంచంలోకెల్లా అద్భుతమైన రాజధానిని నిర్మించాలని అక్కడి ప్రజలు ఇప్పుడు కోరుకోవడం లేదు. సౌకర్యవంతమైన రాజధాని నిర్మాణం జరిగితే చాలని మాత్రమే కోరుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా పోలవరం నిర్మాణం వేగంగా సాగాలి. ప్రస్తుత కాంట్రాక్టర్ వల్ల అది సాధ్యంకాదన్న అభిప్రాయం విస్తృతంగా ఉన్నందున ప్రత్యామ్నాయ కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించడం మంచిది. ప్రభుత్వం పట్ల ప్రజలలో ఫీల్‌గుడ్ భావన పెంపొందించడానికి రాజకీయంగా ఆలోచించి చర్యలు తీసుకోవాలి. అంతా నాకు తెలుసు అని కాకుండా, మీకు తెలిసింది కూడా చెప్పండి అని చెప్పుకునే అవకాశం కల్పిస్తే దానివల్ల ప్రయోజనం పొందేది ముఖ్యమంత్రే!
కేసీఆర్‌తో పోల్చితే చంద్రబాబు బాగా వెనుకబడి ఉన్నారు
కులాల పేరుతో చిచ్చు పెడుతున్నారు కొందరు-బాబు
AP కి 6 పద్మ అవార్డులు వస్తే అందులో 5 కమ్మ కులస్తులకు వచ్చాయి, 14 MLC పదవులు ఇస్తే అందులో 7కమ్మ కులస్తులకే.కీలక ప్రభుత్వ పదవుల్లో 80% బాబు కులస్తులే , ఇవి కాక ఢిల్లీలో ,విదేశాల్లో పదవులు కూడా కమ్మ కులస్తులకే
బాబు వచ్చాక కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి-లోక్ సత్తా JP చౌదరి
శివరామ కృష్ణన్ కమిటీ వద్దన్నా విజయవాడ గుంటూరు లో రాజధాని పెట్టడానికి కారణం కమ్మ కులస్థులు ఎక్కువగా ఉండటమే-Times Of India
విజయవాడ గుంటూరు పొతే కుల కంపు కొడుతోంది
-సి రామచంద్రయ్య, శాసన మండలి లో ప్రతిపక్ష నాయకుడు
మీరు అన్నీ మీ కులస్తులకు ఇస్తుంటే మిగితా కులాల వారు నోట్లో వేలు వేసుకొని చూస్తుండాలా? ఇప్పుడు చెప్పండి ఎవరు చిచ్చు పెడుతున్నారు?
http://www.prajasakti.com/Article/AndhraPradesh/1858919