-రాజధానిలో ఎకరా రూ.50 లక్షల చొప్పున 500 ఎకరాల కేటాయింపు
-వాణిజ్య భూమి ఎకరా రూ.14.49 కోట్లుగా అంచనా
-మొత్తం విలువ సుమారు రూ.7,245 కోట్లు, కేటాయించింది రూ.250 కోట్లకు..
-ప్రభుత్వ పెద్దల పాత్రపై రైతుల్లో అనుమానాలు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :
రాజధాని పరిధిలో కోట్ల విలువ చేసే వందల ఎకరాల భూములను కారుచౌకగా కొన్ని ప్రైవేటు సంస్థలకు అప్పనంగా కట్టబెట్టారని రాజధాని గ్రామాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. విద్యాసంస్థల పేరిట ఎకరా రూ.50 లక్షల చొప్పున 500 ఎకరాలు కేటాయిం చడం సర్వత్రా చర్యనీయాంశమైంది. విట్, ఎస్‌ఆర్‌ఎం వంటి ప్రైవేటు విద్యాసంస్థలకు భూ సంతర్పణపై విమ ర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిలో భూములను అభివృద్ధి చేసిన తర్వాత గజం రూ.25 వేల వరకూ ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వ అనుమతులు పొందిన భూమి అంచనాదారులు నివాస స్థలం గజం రూ.15 వేలు, వాణిజ్య భూమి రూ.30 వేల వరకూ పలుకుతుందని అంచనాలు వేశారు. ఈ లెక్కల ప్రకారం ఆయా విద్యాసంస్థలకు కేటాయించిన వాణిజ్య భూములకు గజం రూ.30 వేల చొప్పున లెక్కిస్తే ఎకరా సుమారుగా రూ.14.49 కోట్లు విలువ చేస్తుంది. రోడ్లేసి అభివృద్ధి చేసిన తరువాత మిగిలిన భూమికీ అదే ధరను వర్తింపజేస్తారు. దీని ప్రకారం 500 ఎకరాల విలువ దాదాపుగా రూ.7,245 కోట్లు. రూ.50 లక్షల చొప్పున కేటాయించడం ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కేవలం రూ.250 కోట్లు. ప్రభుత్వ అంచనాలను పక్కనబెట్టి భూ కేటాయింపులు జరపడం ద్వారా సుమారు రూ.7,000 కోట్ల విలువైన భూమి అతితక్కువ ధరకు మూడు ప్రైవేటు విద్యాసంస్థల చేతుల్లోకి వెళ్లిపోయిందని, ఈ కేటాయింపుల వెనుక పెద్దఎత్తున లావాదేవీలు జరిగి ఉండొచ్చనే అనుమానాలు రాజధాని ప్రాంత వాసుల్లో వ్యక్తమవుతున్నాయి. పెద్దల ప్రమేయంతోనే తక్కువ ధరకు భూములు కేటాయించి ఉండొచ్చన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
http://www.prajasakti.com/Article/AndhraPradesh/1859276
‘జనచైతన్య’ యాత్రలు కత్తిమీద సామే!— కంచల జయరాజ్,10TV
తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడే ఎన్నికలకు సిద్ధమౌ తున్న సంకేతాలను పంపి స్తోంది. అధికారం చేపట్టి రెండు న్నరేళ్లు పూర్తయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, నెరవేర్చిన విధానాన్ని పరిశీలిస్తే తీవ్ర నిరాశే ఎదురవుతోంది. 2014 ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావించి బరిలోకి దిగిన చంద్రబాబునాయుడు అధికారమే పరమావధిగా ఉన్నటువంటి అన్ని శక్తుల్నీ వినియోగించారు. ప్రాంతాలు, కులాలు, మతాలను సైతం ఓట్ల కోసం ఉపయోగించు కున్నారు. ఫలితంగానే ఆఖరి నిమిషంలో అధికారం సొంతమైంది. అప్పటి వరకూ వైసిపికి తిరుగులేని అధికారం దక్కుతుందని అంచనా వేసిన సర్వేలన్నీ చంద్రబాబు చివరి నిమిషంలో రైతుల రుణమాఫీ మంత్రం తీవ్ర ప్రభావాన్నే చూపింది. అధికారాన్ని హస్తగతం చేసుకోవాల్సిన వైసిపి ప్రధాన ప్రతిపక్షంగానే మిగిలి పోయింది. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి పాలనాపర మైన రాజకీయ అనుభవం అవసరమని రాష్ట్ర ప్రజలు భావించడం వల్లే గడిచిన ఎన్నికల్లో రాజకీయ అనుభవం లేని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాదని.. రాజకీయ యోధుడిగా ఉన్న నారా చంద్రబాబునాయుడికి అధికారాన్ని కట్టబెట్టారు.
కానీ, అధికారంలోకొచ్చిన మొదటి రోజు నుంచి ఇచ్చిన హామీలు, రాష్ట్ర ప్రజా అవసరాలు పక్కనపెట్టి, తన సొంతం ఎజెండానే ముఖ్యమంత్రి అమలు చేయడం ప్రారంభించారు. ఫలితంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారం చేపట్టిన ఏడాదిలోపు నుంచే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇది రోజురోజుకూ పెరుగుతున్నదే తప్ప తగ్గే పరిస్థితుల్లేకుండాపోతున్నాయి. మరోవైపు సొంత పార్టీలోని నాయకత్వంపై చంద్రబాబుకు పట్టు సన్నగిల్లుతోంది. ఇంకోవైపు అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు, ఎడతెరిపి లేని సమీక్షలతో విసిగివేసారిపోతున్నాయి. ఇది చంద్ర బాబుకు, పాలనా వ్యవస్థకు మధ్య తీవ్రమైన అగాథం ఏర్పడేలా తయారైంది.
ముఖ్యమంత్రి గడిచిన రెండున్నరేళ్లలో చేసిన అభి వృద్ధి కంటే దేశ, విదేశాలతో చేసుకున్న ఒప్పందాలే ఎక్కువగా ఉన్న విషయాన్ని వెల్లడించడంలేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేపడ్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి.. సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను అత్యంత రహస్యంగా ఉంచడం వెనుక ఆంతర్యమేమిటో వెల్లడించడం లేదు.
గుర్తొచ్చి నప్పుడల్లా భూమి పూజలు, శంకుస్థాపనలతో సరిపెడుతూ అమరావతిలో ఏదో అద్భుతం జరుగుతుందనే భ్రమను కల్పించడం మినహా కార్యాచరణలో జరుగుతున్నది ఏమీ లేదని ఆ ప్రాంతానికి వెళ్లి చూసిన వారికెవరికైనా అర్థమవు తుంది. సింగపూర్ కంపెనీలకు అమరావతి భూములను ధారాదత్తం చేసే వ్యూహానికి బ్రేక్ పడడం వెనుక ప్రతిపక్షాలు, వామపక్షాల కుట్ర ఉందని విమర్శించే తెలుగుదేశం పార్టీ నాయకత్వం స్విస్ ఛాలెంజ్ విధానం ఆంధ్రప్రదేశ్‌కు సరిపోదనే వాస్తవాన్ని ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావడం లేదు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, ప్రమాణ స్వీకారం రోజున చేసిన ఐదు సంతకాలు కార్యాచరణలో ఏ మేరకు అమలయ్యాయనేది సమీక్షించి చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడంతో చంద్రబాబుపై విశ్వాసం సన్నగిల్లుతోంది. ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్రలో ఆయనిచ్చిన సందేశాలకు ముగ్ధులై చాలా మంది రైతులు రుణాలు చెల్లించలేదు. కరెంటు బిల్లులు కట్టలేదు. అధికారంలోకొచ్చిన తర్వాత రైతుల రుణమాఫీని రోజురోజుకు తగ్గిస్తూ కఠినమైన నిబంధనలను అమలు చేస్తూ ఇచ్చిన మాట తప్పారు. విద్యుత్ బిల్లుల ఊసే లేకుండా పోవడంతో ఉన్న విద్యుత్ కనెక్షన్లు కోల్పోవాల్సిన అసాధారణమైన పరిస్థితులెదుర్కొంటు న్నారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలు, బాబు వస్తే జాబ్ వస్తుందన్న నిరుద్యోగుల ఆశలు సన్నగిల్లాయి.
జన్మభూమి కమిటీల పేరిట తెలుగుతమ్ముళ్లు చేసే అరాచకాలను అడ్డుకోవడం చంద్రబాబు వల్ల కూడా కాకుండాపోయింది.
ఇసుక మాఫియా, మద్యం మాఫియా, కాల్‌మనీ మాఫియా రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తున్నా అదుపు చేయడం చంద్రబాబుకు సాధ్యంకాలేదు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు బరితెగించి దాడులకు పాల్పడినా, భూ కబ్జాలు చేసినా, కాల్‌మనీ కేసులో ఇరుక్కున్నా వారందరినీ రక్షించే ప్రయత్నాలు చేశారే తప్ప సాహసించి చర్యలు తీసుకుని ప్రజా విశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నాలు ఏ మాత్రం చేయలేదు.
(వ్యాసకర్త 10టీవీ డిప్యూటీ ఇన్‌పుట్ ఎడిటర్, విజయవాడ)