దందా ‘రాజకీయం’

దందా ‘రాజకీయం’
– పెద్ద నోట్ల తకరారు.. ‘తమ్ముళ్ల’ హుషారు
– ‘చిన్న’ నేత పెద్ద సాయం
– రంగంలోకి ‘స్క్రూ’లు
– పువ్వుల పేరుతో పర్సంటేజీలు
– దళారీలకు బ్యాంకు అధికారుల సహకారం!

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో పెద్దఎత్తున కమిషన్ల దందా సాగుతోంది. అధికార పార్టీ నేతలే ఈ దందాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నిఘా వర్గాలు కూడా దీనిపై దృష్టి సారించాయి. కమిషన్‌ వ్యాపారం చేసే కీలక వ్యక్తుల వద్ద లావాదేవీలు నిర్వహించే కొందరు వ్యక్తులను స్క్రూలుగా పిలుస్తారు. వారి సహాయంతో అధికారపార్టీ నేతలు ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా కోడ్‌ బాషలో సాగిస్తున్నారు.

పర్సంటేజ్‌ల విషయంలో కూడా వీరు కొన్ని గుర్తులను ఫాలో అవుతున్నారు. కమిషన్‌ 20 శాతమైతే బంతి పువ్వు, 25కు మల్లె, 30 శాతానికి గులాబీలను కొందరు గుర్తులుగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మధ్య వర్తులకు ఇచ్చే కమిషన్‌ విషయాన్ని కూడా 1, 2లుగా వ్యవహరిస్తున్నారు. కొందరు బ్యాంకర్లు వీరికి సహకరి స్తున్నారు.

కమిషన్‌ దందా ఇలా …
– రాజధాని ప్రాంత జిల్లాల్లో ఓ ఎంపి కార్యాలయానికి చెందిన అనుబంధ సంఘాల నేతతో పాటు మరో ‘యువత’ నేత విజయవాడ పాతబస్తీ ప్రాంతంలోని ఓ మార్వాడీతో ఒప్పందం కుదర్చుకున్నట్లు వినికిడి. అతని సహాయంతో అంతర్రాష్ట్ర వ్యాపారుల వద్ద ఉన్న పెద్ద పాత నోట్లను వీరు భారీ ఎత్తున మార్పిడి చేస్తున్నారు.

-విజయవాడ నగరంలోని ప్రముఖ విద్యాసంస్థ ఆన్‌లైన్‌ దందాకు తెరతీసింది. విద్యాసంస్థకు చెందిన పదహారు శాఖల ఉద్యోగులు, అటెండర్ల ఖాతాల్లోకి సుమారు 2.5లక్షల వరకూ నగదును బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఒక కేంద్రమంత్రి నల్లధనాన్ని మార్చే క్రమంలోనే ఈ నగదు బదిలీ జరిగినట్లు సమాచారం.

– విజయవాడలోని ఓ ఎమ్మెల్యే తన కార్యాలయాన్నే కమిషన్‌ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చారన్న విమర్శలున్నాయి. ఆయన సహచరులు గత రెండు వారాలుగా ఉదయం లేచిన దగ్గర నుంచి ఇదే వ్యవ హారాలపై తిరుగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

– నగరానికే చెందిన మరో ఎమ్మెల్యే తన వద్ద ఉన్న సుమారు రూ.ఐదు కోట్లను ఎటువంటి కమిషన్లు లేకుండా మార్చుకున్నట్లు గుసగుసలు వినవస్తున్నాయి. ఎంత నల్లడబ్బునైనా మారుస్తామని సదరు ఎమ్మెల్యే కుమారులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం.

– గుంటూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి నోట్లను మార్చమంటూ కొన్ని పురుగు మందులు, ఎరువులు, విత్తన కంపెనీలపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.

– గుంటూరు జిల్లాకే చెందిన అధికార పార్టీలోని మరో కీలక ప్రజాప్రతినిధి కొడుకు కూడా నోట్ల మార్పిడిలో తలమునకలైనట్లు తెలుస్తోంది. పెట్రోల్‌ బంకులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లతో పాటు బ్యాంకర్లనూ నోట్ల మార్పిడి కోసం బెదిరిస్తున్నట్లు సమాచారం.

– కృష్ణాజిల్లాలో ఒక కీలక మంత్రి పేరుతో ఆర్థిక దందా సాగుతోంది. విజయవాడ రూరల్‌ ప్రాంతాల్లోని భవన నిర్మాణ గుత్తేదార్లతో పాటు బడా కాంట్రాక్టర్లు, కొందరు పారిశ్రామికవేత్తల వద్ద పెద్ద మొత్తాలను సదరు మంత్రి అనుచరులు డీల్‌ చేస్తున్నారు.

– ఇసుక దందాల్లో కోట్లు వెనకేసుకున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ వివాదాస్పద ఎమ్మెల్యే నోట్ల మార్పిడి విషయంలో నూతన ఒరవడి సృష్టిస్తున్నారు. ఎటువంటి వడ్డీలు లేకుండా తన కార్యకర్తలకు కోట్ల రూపాయలు చెక్కులు తీసుకుని, ప్రామిసరీ నోట్లు రాయించుకుని ఉదారంగా ఇచ్చేస్తున్నారు. ఈ విధంగా సుమారు రూ.30 కోట్లు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఆరు నెలల ముందు తనకు ఇవ్వాలని షరతు విధించడం విశేషం.

– రాష్ట్ర మంత్రివర్గంలో కీలక శాఖ నిర్వహిస్తున్న తూర్పు గోదావరికి చెందిన మంత్రి సోదరుడు తుని, పరిసర ప్రాంతాల్లోని బంగారం, వస్త్ర వ్యాపారుల వద్ద ఉన్న కోట్లాది రూపాయలను బ్యాంకు అధికారుల సాయంతో కొత్త నోట్లుగా మార్చేస్తున్నట్లు వినికిడి.

– శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులతో పాటు ఒక ఎంపి కూడా నోట్ల మార్పిడి రాకెట్‌లో తమ వంతు పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

– అనంతపురం జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ఎంపి సోదరుడు నోట్ల మార్పిడి పేరుతో హల్‌ చల్‌ చేస్తున్నాడు. బ్యాంకర్లను బెదిరించి మరీ తన పనులు చేయించుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అదే జిల్లాకు చెందిన అధికార పార్టీకి చెందిన యువనేత కూడా తన శక్తి మేరకు దందాలో పాలుపంచుకుంటున్నట్లు తెలుస్తోంది.

– ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలో చేరిన కర్నూలు జిల్లా ఎమ్మెల్యే, నెల్లూరుకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే కూడా హవాలా ద్వారా నోట్ల మార్పిడి దందాలో చురుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నై నగరం నుంచి కూడా నెల్లూరుకు పెద్ద మొత్తంలో కొత్త నోట్లు వస్తున్నట్లు సమాచారం.

http://www.prajasakti.com/Article/AndhraPradesh/1866112

5 Comments

Filed under Uncategorized

5 responses to “దందా ‘రాజకీయం’

 1. Veera

  య‌న‌మ‌ల ఇలాకాలో జ‌గ‌న్ కొత్త చ‌రిత్ర‌
  ఏపీ ప్ర‌తిప‌క్ష నేత కొత్త చ‌రిత్ర సృష్టించారు. ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల సొంత ఇలాకాలో హ‌ల్ చ‌ల్ చేశారు. 33ఏళ్లుగా య‌న‌మ‌ల కుటుంబానికి అండ‌గా ఉంటున్న ఆ బ్ర‌ద‌ర్స్ సొంత మండ‌లం తొండంగిలో న‌యా రికార్డ్ నెలకొల్పారు. సుదీర్ఘ చ‌రిత్ర క‌లిగిన య‌న‌మ‌ల బ్ర‌ద‌ర్స్ సొంత అడ్డాపై వైఎస్ జ‌గ‌న్ హ‌వా సాగించారు. ఇన్నాళ్ల చ‌రిత్ర‌లో ఏ రాజకీయ నాయ‌కుడు ..చివ‌ర‌కు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉన్న‌ప్పుడు కూడా సాధ్యం కానిది ఇప్పుడు జ‌రిగింది. దాంతో అధికార ప‌క్షంలో ఆందోళ‌న బ‌య‌లుదేర‌గా..విప‌క్ష శ్రేణుల‌కు కొత్త ఊపునిచ్చింది. స్థానికంగా ఓ ఛోటా నేత వ్యాఖ్య ప్ర‌కారం తాజాగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మం ద్వారా ఏపీలో 175 స్థానాల‌కు గాను తుని నియోజ‌క‌వ‌ర్గం వైఎస్సార్సీపీ ఖాతాలో చేరిపోయిందన్నంత ధీమా వ్య‌క్త‌మ‌య్యింది.

  తుని నియోజ‌క‌వ‌ర్గంలోని తొండంగి మండ‌లంలో దివీస్ ఫార్మా నిర్మాణానికి వ్య‌తిరేకంగా మూడు నెల‌లుగా స్థానికులు మ‌డ‌మ‌తిప్ప‌ని పోరాటం చేస్తున్నారు. 80 రోజుల‌కు పైగా 144 సెక్ష‌న్ పెట్టిన‌ప్ప‌టికీ, వంద‌ల కేసులు బ‌నాయించిన‌ప్ప‌టికీ, మ‌హిళ‌ల మీద దాడుల‌కు పాల్ప‌డిన‌ప్ప‌టికీ వెన‌క‌డుగు వేయ‌డం లేదు. దాంతో ఆ ఉద్య‌మానికి సంఘీభావంగా జ‌గ‌న్ రంగంలో దిగారు. తుని నుంచి ప్ర‌స్తుతం ప్రాతినిధ్యం వ‌హిస్తున్న దాడిశెట్టి రాజా మీద కూడా కేసులు పెట్టించి అక్క‌డ య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు సోద‌రుడు కృష్ణుడు రాజ్యాంగేత‌ర శ‌క్తిగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం వివాదాస్ప‌దమ‌వుతోంది. ఎమ్మెల్యేని నామ‌మాత్రం చేసి పూర్తిగా పూర్తిగా య‌న‌మ‌ల సోద‌రుడి హ‌వా న‌డుస్తోంద‌న్న‌ది స్థానికుల అబిప్రాయం.

  దాంతో రంగంలో వైఎస్ జ‌గ‌న్ భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు. య‌న‌మ‌ల రాజ‌కీయ ఆరంగేట్రం చేసిన త‌ర్వాత తొండంగి మండ‌లంలో మ‌రో పార్టీ ఎన్న‌డూ ఇంత పెద్ద స‌భ నిర్వ‌హించిన చ‌రిత్ర లేదు. ఏకంగా య‌న‌మ‌ల సొంత మండ‌లంలో య‌న‌మ‌ల బ్ర‌ద‌ర్స్ ని జ‌నం శాప‌నార్థాలు పెట్టే స్థాయిలో స‌భ జ‌ర‌గ‌డం తునిలో పెద్ద క‌ల‌క‌లం రేపుతోంది. సంచ‌ల‌నంగా మారుతోంది. ఇన్నాళ్లుగా య‌న‌మ‌ల పేరు పెట్టి విమ‌ర్శ‌లు చేయ‌డానికి కూడా వెన‌క‌డుగు వేసిన జ‌నాలు ఇప్పుడు ఏకంగా జ‌గ‌న్ స‌మ‌క్షంలో కృష్ణుడి మీద సూటిగా విమ‌ర్శ‌లు చేయ‌డం విశేషంగా భావిస్తున్నారు.

  దాంతో తొండంగి మండ‌లం దాన‌వాయిపేట‌లో జ‌రిగిన దివీస్ వ్య‌తిరేక స‌భ సంపూర్ణంగా విజ‌య‌వంత‌మ‌యిన‌ట్టు వైఎస్సార్సీపీ శ్రేణులు చెబుతున్నాయి. స్థానికులు మాత్రం జ‌గ‌న్ రంగంలో దిగ‌డంతో ఇక దివీస్ ఫార్మా కాలుష్య‌భూతం త‌మ‌ను వీడిపోతుంద‌న్న విశ్వాసం వ్య‌క్తం చేస్తున్నారు. అప్ప‌టి వ‌ర‌కూ ఉద్య‌మాన్ని మాత్రం కొనసాగిస్తామ‌ని అంటున్నారు. నేరుగా చంద్ర‌బాబు వాటాలు దండుకుంటూ దివీస్ లాంటి ఫార్మా కంపెనీల పేరుతో హాచ‌రీల‌ను స‌ర్వ‌నాశ‌నం చేస్తున్నార‌ని చేసిన విమ‌ర్శ‌లు రాజ‌కీయంగా ప్ర‌కంప‌న‌లు సృష్టించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

  http://telugu.updateap.com/godavari-districs/%E0%B0%AF%E2%80%8C%E0%B0%A8%E2%80%8C%E0%B0%AE%E2%80%8C%E0%B0%B2-%E0%B0%87%E0%B0%B2%E0%B0%BE%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%9C%E2%80%8C%E0%B0%97%E2%80%8C%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%95/

 2. Veera

  ‘అర్థక్రాంతి’ అనిల్ బోకిల్… మోడీపై మండిపాటు!
  ప్రతిపక్షాలు కాదు.. మీడియా కాదు.. బాధితులు కాదు.. అసలు ఎవరి సలహా మేరకు అయితే మోడీ ఈ నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారని తొలి రోజు నుంచి ప్రచారం జరిగిందో ఇప్పుడు అదే వ్యక్తి ప్రధానమంత్రి తీరుపై, ప్రభుత్వ విధానంపై అసహనం వ్యక్తం చేశారు!

  మోడీ నిర్ణయం వెనుక వ్యక్తిగా.. వార్తల్లోకి వచ్చిన ‘అర్థక్రాంతి’ సిద్ధాంత కర్త అనిల్ బోకిల్ కరెన్సీ విషయంలో భారత ప్రభుత్వ తీరును తప్పుపట్టాడు. మారకంలోని ఐదువందల, వెయ్యి నోట్ల రద్దు.. తదనంతర పరిణామాలపై స్పందిస్తూ… ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరికాదని స్పష్టం చేశాడాయన!

  అనిల్ బోకిల్ ఈ ఏడాది జూలైలో ప్రధానమంత్రితో సమావేశం అయ్యారు. అంతకు ముందే ‘అర్థక్రాంతి’ పేరుతో తను రూపొందించిన ఆర్థిక సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్న ఆయనకు మోడీతో తొమ్మిది నిమిషాల పాటు సమావేశం అయ్యే అవకాశం లభించింది. జూలైలో అర్థక్రాంతి గురించి బోకిల్ మోడీకి వివరించాడు.

  తను మొత్తం ఐదు పాయింట్ల రూపంలో అర్థక్రాంతి గురించి వివరిస్తే.. మోడీ ప్రభుత్వం కేవలం రెండు పాయింట్లనే పరిగణనలోకి తీసుకుని ‘సెలెక్టివ్’ గా వ్యవహరించిందని బోకిల్ అంటున్నారు. ఇలా వ్యవహరించడం వల్ల ఏ మాత్రం ప్రయోజనం ఉండదని, దీన్ని సమర్థించేటందుకూ ఏమీ లేదు, వ్యతిరేకించేటందుకూ ఏమీ లేదని ఈ ఆర్థికవేత్త స్పష్టం చేశాడు.

  తమ నిర్ణయాలను మోడీ ప్రభుత్వం అమలు పరుస్తున్న విధానం సమంజసంగా లేదని కూడా ఈయన వ్యాఖ్యానించడం విశేషం. సామాన్యులను, మధ్య తరగతి ప్రజలను బ్యాంకుల క్యూ లైన్లలో నిలబెట్టి.. మోడీ ప్రభుత్వం వారిని ముప్పుతిప్పులు పెడుతోందని అన్నారు.

  ప్రత్యక్ష, పరోక్ష పన్నులను పూర్తిగా రద్దు చేయడం, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ను ప్రవేశ పెట్టడం, రూ.50 మినహా ఆపై విలువ ఉన్న అన్ని నోట్లనూ రద్దు చేయడం, రెండువేల రూపాయలకు మించిన క్యాష్ ట్రాన్సాక్షన్స్ విషయంలో చట్టపరమైన పరిమితులు పెట్టడం.. వంటి సూచనలు ఉన్నాయి ‘అర్థక్రాంతి సిద్ధాంతం’ లో. అయితే వీటిలో మోడీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్న అంశాలు ఏమిటో అందరికీ తెలిసిందే.

  పన్ను విధానంలో, ఇతర వ్యవహారాల్లో ఆర్థిక వేత్తల సూచనలేమీ తీసుకోకుండా ఉన్న ఫలంగా మారకంలోని నోట్ల మార్పిడి అంటూ సామాన్యులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఫలితంగా పక్షం రోజులు అయినా గడవకముందే.. ఎవరి సలహా మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారో అదే వ్యక్తి నుంచి పెదవి విరుపులను ఎదుర్కొంటున్నారు. మరి ఇప్పుడు మోడీభక్తులేమంటారో.. ఈ సిద్ధాంత కర్తను కూడా నల్లధనికుడు అనేస్తే పోలా!

  http://telugu.greatandhra.com/politics/political-news/anil-bokil-slams-modi-govt–76038.html

 3. Veera

  మనకెందుకీ మరక?
  అమరావతి, నవంబర్ 21: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలనుంచి వస్తున్న వ్యతిరేక ప్రభావం రాజకీయంగా తమపై పడకుండా జాగ్రత్తపడాలని తెలుగుదేశం నిర్ణయించింది. రెండురోజుల నుంచి మంత్రులు, పార్టీ నేతల స్వరం పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. జనంలో మోదీ నిర్ణయంపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతున్న క్రమంలో, తాము పెద్దనోట్ల రద్దును స్వాగతించటం కంటే దానివల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గుర్తించి వాటినే ప్రస్తావించి మాట్లాడటం ద్వారా ‘పెద్ద’మరక వదిలించుకోవాలని తెదేపా నాయకత్వం భావిస్తోంది.
  పెద్దనోట్ల రద్దుతో ప్రజల్లో మోదీపై పెరుగుతున్న వ్యతిరేకత ప్రభావం తమపై పడకుండా తెదేపా నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. గతంలో పెద్దనోట్ల రద్దుపై మాట్లాడిన చంద్రబాబు, ఇప్పుడు జనం పడుతున్న కష్టాల గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. మంత్రులు, ఎంపిలు సైతం అదే బాట పడుతున్నారు. ఇన్నిరోజులయినా పరిష్కారం కాని సమస్యను తన రాజకీయ జీవితంలో ఇప్పుడే చూస్తున్నానని బాబు కూడా వ్యాఖ్యానించడం ప్రస్తావనార్హం.

  ఆ పార్టీ ఎంపి డాక్టర్ శివప్రసాద్ నేరుగా నిరసన ప్రదర్శన నిర్వహించడంతోపాటు, ప్రధానిపై చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్య చర్చనీయాంశమయింది. ఎన్నికల్లో భార్యపిల్లలు లేని వారిని అనర్హులుగా ప్రకటించాలని మోదీనుద్దేశించి చేసిన వ్యాఖ్య పరిశీలిస్తే మోదీ నిర్ణయం వల్ల ప్రజల్లో మొదలైన వ్యతిరేకత, తమను ఎక్కడ తాకుతుందోనన్న ఆందోళన అధికారపార్టీ ప్రజాప్రతినిధుల్లో ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. దానికితగినట్లే నియోజకవర్గ ప్రజలు మంత్రులు, ఎమ్మెల్యేలను నోట్ల కష్టాలపై నిలదీస్తున్న పరిస్థితి.

  మంత్రి పత్తిపాటి పుల్లారావు కూడా ముందుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, ప్రజలు ఇబ్బందులు పడుతుండటం బాధాకరమని, దానికి తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లకోసం బాబు కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మోదీ అనుభవజ్ఞుడైన బాబు సలహాలు తీసుకుంటే ఈ సమస్య వచ్చేదికాదన్నారు.

  తెదేపా వైఖరి మారేందుకు ఆ పార్టీ కొద్దిరోజుల నుంచి చేస్తున్న సర్వేలు కూడా కారణమంటున్నారు. మోదీ తీసుకున్న నిర్ణయంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలే తప్ప నల్లధనం ఉన్న వారెవరూ ఇబ్బందిపడటం లేదని, రాజకీయనాయకులు ఎక్కడా ఏటిఎంలలో కనిపించడం లేదన్న అభిప్రాయం ఆ సర్వేలో వెల్లడయింది. మోదీ నిర్ణయం వల్ల చంద్రబాబు కూడా అప్రతిష్టపాలవుతున్నారన్న నివేదికలు వస్తున్నాయి. అందుకే ముందు పెద్దనోట్ల రద్దుపై రోజూ మాట్లాడిన బాబు, ఇప్పుడు ప్రజలు పడుతున్న కష్టాలు, వారికి ప్రత్యామ్నాయంగా 100, 50 నోట్లను అందుబాటులో ఉంచాలంటూ రోజూ సమీక్షలు పెట్టి బ్యాంకర్లను కోరుతున్నారు. కేంద్రానికి వరసపెట్టి లేఖలు రాస్తున్నారు. దీనివల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చన్న లక్ష్యం కనిపిస్తోంది.

  మోదీ నిర్ణయం వల్ల రాజకీయంగా బిజెపి కంటే తమకే ఎక్కువ నష్టం కలిగిస్తుందన్న ఆందోళన తెదేపా నాయకత్వంలో ఉంది. మిత్రపక్షంలో ఉన్నందున ఆ మరక తమకూ అంటుతుందని, మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ దీనిపై పెద్దగా ఆందోళన వ్యక్తం చేయకపోవడాన్ని కూడా తెదేపా నాయకత్వం నిశితంగా గమనిస్తోంది. పెద్దనోట్ల రద్దు వల్ల ఇటీవల బిజెపి అధికారంలో ఉన్న మహారాష్టల్రో నీటి సంఘాలకు జరిగిన ఎన్నికల్లో బిజెపి తుడిచిపెట్టుకుపోయిన వైనాన్ని తెదేపా నాయకత్వం గ్రహించింది. తాజాగా మోదీ సొంత రాష్టమ్రైన గుజరాత్‌లో పార్టీలతో సంబంధం లేకుండా రైతులే వచ్చి, పాతనోట్లను రోడ్డుమీద వేయడం వంటి సంఘటనలు మోదీపై పెరుగుతున్న వ్యతిరేకతగా పార్టీ నేతలు విశే్లషిస్తున్నారు. బిజెపి నేతలతో అంతర్గతంగా సంభాషిస్తున్న తెదేపా నేతలు ఆ పార్టీలోనూ వ్యతిరేకత ఉన్నట్లు గుర్తించింది.
  పెద్దనోట్ల రద్దుపై ముందు అందరికంటే ఎక్కువగా మాట్లాడి దెబ్బతిన్న తెదేపా ఇప్పుడు జనస్పందన, ప్రతికూల ఫలితాలు పరిశీలించి, ఇంకా మేల్కొనకపోతే ప్రజల్లో దెబ్బతింటామన్న అంతిమ నిర్ణయానికి వచ్చింది. ఇకపైనా నోట్లపై ప్రజలు పడుతున్న కష్టాలతోపాటు, వాటికి ప్రత్యామ్నాయాలపై నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్రంపై ఒత్తిడి వ్యూహానే్న అమలుచేయాలని నిర్ణయించింది.

  http://www.andhrabhoomi.net/content/ap-2657

 4. Veera

  నోట్ల రద్దుపై విదేశీ మీడియా కామెంట్స్….
  గార్డియన్‌, న్యూయార్క్‌ టైమ్స్‌, బ్లూమ్‌బర్గ్‌, హెరాల్డ్‌…మొదలైన పత్రికలు మోడీ తీసుకున్న నిర్ణయం ‘పాలసీ ఫెయిల్యూర్‌’గానే చూపాయి. పెద్ద నోట్లు వంటి అత్యంత కీలకమైన నిర్ణయంలో ఆర్థికశాఖ, బ్యాంకింగ్‌ నిపుణులను పరిగణలోకి తీసుకోకుండా మోడీ ముందుకు వెళ్లారని కొన్ని పత్రికలు రాశాయి.

  అంతర్జాతీయ పత్రికలు, ఆన్‌లైన్‌ ఎడిషన్స్‌…అన్నీ భారత్‌లోని ప్రస్తుత స్థితిని ప్రతిబింబించాయనే చెప్పొచ్చు. కోట్లాది మంది సాధారణ జనం తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని, పెండ్లిళ్ల సీజన్‌ కావటం వల్ల ఎన్నో కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయని, బ్యాంకుల ముందు ఎడతెగని క్యూ ఉంటోందని, రోజువారీ కూలి చేసుకునే బతికేవారు…పని మానుకొని బ్యాంక్‌ ముందు నిలబడాల్సి వస్తున్నదని, ఆహారం, మందులు కూడా కొనుక్కోలేని విపత్కర పరిస్థితులు సైతం వచ్చాయని విదేశీ మీడియా వార్తల్ని ప్రచురించింది.

  గార్డియన్‌ ఎడిటోరియల్‌

  ధనికులు, ఉన్నతవర్గాలు ఎవరూ పెద్దగా ఇబ్బంది పడటం లేదు. అవినీతి, నల్లధనం పోగేసినవారంతా జాగ్రత్తపడ్డారు. షేర్లు, బంగారం, రియల్‌ఎస్టేట్‌…తదితర రంగాల్లోకి తమ నల్లధనాన్ని తరలించారు. కానీ పేదలకే ఏం చేయాలో పాలుపోవటం లేదు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల నష్టపోయింది సామాన్య ప్రజలే. గ్రామాల్లో నివసించే అత్యధికులకు బ్యాంక్‌ ఖాతాలు లేవు. నగదు లావాదేవీలు ఒక్కసారిగా ఆగిపోవటం వల్ల వీరంతా ఏం చేయాలో తెలియని స్థితి. రోజంతా బ్యాంకుల ముందు క్యూ కడుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే నోట్ల రద్దు కారణంగా 30 మందికి పైగా చనిపోయారు. మరికొద్ది వారాల్లో అంతా సర్దుకుంటుందని కేంద్రం చెబుతున్నది.
  ద్రవ్యోల్బణం, కరెన్సీ నష్టాలు, ప్రజా తిరుగుబాట్లను ఎదుర్కోవడానికి గతంలో నియంతలు ఇలాంటి నిర్ణయాలు అమలుజేసి విఫలమయ్యారు. ఇప్పుడు మోడీ కూడా అదే విధమైన ప్రయోగం చేసి దెబ్బతిన్నారు. నోట్ల రద్దును కాకుండా, పన్నుల విధానాన్ని పున:సమీక్షించుకుంటే బాగుండేది.

  ద న్యూయార్క్‌ టైమ్స్‌

  ఇండియాలో నగదు లావాదేవీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.78 శాతం ప్రజలు నగదులోనే కొనుగోలు, చెల్లింపులు జరుపుతారు. బ్రిటన్‌, అమెరికాలతో ఇక్కడ పోలిక తీసుకురాలేము. క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, బ్యాంక్‌ ఖాతాలతో సంబంధం లేకుండా పట్టణాల్లో, గ్రామాల్లో ఎంతో జరుగుతుంది. పరిమిత స్థాయిలో క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో చెల్లింపులు జరుగుతాయి. నోట్ల రద్దు మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థనే కదిలించింది. కోట్లాది మందిని బలవంతంగా బ్యాంక్‌ ముందు నిలబెట్టింది. పాత నోట్లను మార్చుకోవటం, కొత్త నోట్లను తీసుకోవటం పెద్ద ప్రహసనంగా మారింది.

  బ్లూమ్‌బర్గ్‌

  మోడీ సాహసోపేత నిర్ణయంగా తొలుత కనపడింది. కానీ నాలుగు రోజులు అయ్యాక…మోడీ తప్పు లెక్కవేశారని, చేదు ఫలితాన్ని ఇచ్చిందని అర్థమైంది. ముందువెనుకా చూసుకోకుండా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్ల రద్దు కారణంగా…ఒక్కసారిగా 86 శాతం నగదు విలువ లేకుండా పోయింది. వీటి స్థానంలో ఆర్‌బీఐ కొత్త నోట్లను తీసుకురాలేకపోయింది. ఏటీఎంల్లో కొత్త నోట్లను పెట్టడానికి ఏర్పాట్లు జరగలేదు. 50 రోజులు కాస్త ఒపికపట్టండంటూ ప్రధాని మోడీ చెబుతున్నారు. కొన్ని సంవత్సరాలపాటు సామాన్యుల కష్టాలు ఇప్పుడే తీరేట్టు కనపడటం లేదు. కూలీలకు పని దొరకటం లేదు. చాలా మంది మహిళలకు బ్యాంక్‌ ఖాతాలు లేవు.

  హెరాల్డ్‌

  పరిస్థితులు ఏవైనా…నగదు నోటు ఇచ్చిన హామీ నెరవేరాల్సిందే. కానీ ఆ నమ్మకం ఇండియాలో పోయింది. బ్యాంకులు, ఏటీఎంల ముందు పెద్ద పెద్ద క్యూలు కనపడుతున్నాయి. నల్లకుబేరులు జాగ్రత్తపడతారని హఠాత్తుగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

  (నవతెలంగాణ సౌజన్యంతో)

  http://teluguglobal.in/telugu/international-media-comments-on-notes-demonetisation/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s