………………….. ఏ శాసనసభ్యుడైనా సరే, శాసనసభ్యురాలైనా సరే….. ప్రతిపక్షం నుంచి పాలకపక్షం వైపు ఎందుకు వెళ్తారు..? జనం, తమకు ఓట్లేసిన ప్రజల తీర్పును కాదని, దాన్ని తుంగలో తొక్కి ఎందుకు పార్టీ మారతారు..? సింపుల్… ఏవో ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి…. అబ్బే, కాదు, నియోజకవర్గం అభివృద్ధి కోసం అంటారా..? సరే, మీ ఇష్టం… ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వం కేవలం తమ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలను మాత్రమే డెవలప్ చేస్తారు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే ఆ ప్రజల్ని గాలికి వదిలేస్తారూ అంటే… అదే వాదిస్తే మనమేం చేయలేం… ఇంతకీ ఎందుకీ ప్రస్తావన అంటారా..? పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరబోతున్నదీ అనే వార్త… అదీ ఆంధ్రజ్యోతిలో వచ్చింది కాబట్టి, అది తెలుగుదేశం గెజిటే కాబట్టి నమ్ముదాం… మరి ఆమె ఎందుకు మారుతున్నది..? ప్రజలు ప్రతిపక్షంలో ఉండి, ప్రజల తరఫున పోరాడమ్మా అని తీర్పు చెబితే, దాన్ని కాలరాచి, టీడీపీ పచ్చ శిబిరంలో ఎందుకు చేరుతున్నది..? ఆమెకు దక్కే ప్రయోజనాలు ఏమిటి..? ఇదీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చ… రాజకీయాల్లో ఎవరైనా సరే, తమకు ఏమొస్తుందని తప్ప ఇంకేమీ ఆలోచించరు… పాపం, ఆమె కూడా రాజకీయ నాయకురాలే కదా… అంతకు భిన్నంగా ఏం ఆలోచిస్తుంది..? మరి ఆమెను టీడీపీ వైపు నెట్టేస్తున్న ఆ ప్రలోభాలు ఏమిటీ…?
ఈనెల 23న ఆమె పచ్చ తీర్థం పుచ్చుకుంటున్నదట… ఇంతకీ ఆమె నేపథ్యం ఏమిటి..? ఆమె భర్త ఆదాయపు పన్ను శాఖలో ఓ సీనియర్ అధికారి, కానీ రెండేళ్లే పదవీ విరమణకు గడువు… ఆమె వైసీపీలో ఉంది కాబట్టి అతన్ని ప్రాధాన్యం లేని పదవిలో వేశారట… అంటే చంద్రబాబు చెబితే అంతటి రాగద్వేషాలు లేని ఫకీర్ మోడీ కూడా చివరకు ఈ స్థాయి అధికారుల మీద రాజకీయపరమైన కక్షసాధింపులు ప్రదర్శిస్తున్నాడా..? ఏమో… సరే, అది వదిలేద్దాం… కల్పన గనుక టీడీపీలో చేరితే ఏకంగా ఆయన్ని ఐటీ కమిషనర్ ను చేస్తామని చెప్పారట, ఆమె నమ్మేసిందట… మరీ ఐటీ శాఖలో ఇంత చీపై పోయాయా పదవులు, పదోన్నతులు..? పాపం… మోడీ..! వచ్చే ఎన్నికల్లోపు ఆయన కమిషనర్ గా నాలుగు డబ్బులు వెనకేసుకుంటే, 2014 ఎన్నికల వ్యయంతోపాటు 2019 ఎన్నికల వ్యయం కూడా టీడీపీయే భరిస్తుందట… ఎక్కడ..? కేవలం పామర్రు మాత్రమే కాదు… అప్పటికి రిటైరయ్యే ఆయనకు బాపట్ల ఎంపీ టికెట్టు ఇచ్చి, ఇటు పామర్రు ఎమ్మెల్యే సీటు, అటు బాపట్ల ఎంపీ సీటు ఎన్నికల ఖర్చు కూడా హెరిటేజ్ ఖాతా నుంచే…. సారీ, చంద్రబాబు గారే భరిస్తారట… అదే చెప్పారట… ఈ జగన్ తో ఉంటే, ఈ ఓదార్పులు, ఖర్చులూ తప్ప ఇంకేముంటాయనే భావనతో ఆమె ఈ నిర్ణయం తీసేసుకున్నదట… ఫన్నీగా అనిపిస్తుందా..? అవును మరి… ప్రస్తుత రాజకీయాలు ఫన్నీ గాక మరేమిటి..?
మరి ఆమెను జగన్ తో ఉండాలని గత ఎన్నికల్లో తీర్పు చెప్పిన ప్రజల మాటేమిటి..? పిచ్చోళ్లారా.. జనం తీర్పును పట్టించుకుంటే రాజకీయ నాయకులు ఎలా అవుతారు..? జనం ఏదో చెబుతుంటారు… మన బాట మనది… అంతే….
http://www.muchata.com/main-news/tdp-offered-double-dhamaka-to-uppuleti/