ఎపికి ప్రత్యేక వంచన-రెండో అధ్యాయం

ఎపికి ప్రత్యేక వంచన-రెండో అధ్యాయం– ప్రజాశక్తి -తెలకపల్లి రవి
గత వారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా చెప్పాలంటే బిజెపి, తెలుగుదేశం కూటమి నేతలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల పట్ల వ్యవ హరించిన తీరు అభద్రతకూ, అహంకారానికీ పరాకాష్ట. మరో వైపున ఆ ప్రజలు కనీస పరిజ్ఞానమైనా లేని అమాయకులని భావించి పరిహసించడమూ జరిగింది. ఎన్నికల్లో గెలిచాము గనక దేశమూ రాష్ట్రమూ పూర్తిగా తమ జిరాయితీ హక్కు కింద పరిగణించి ఇంకెవరూ నోరెత్తరాదనే అప్రజాస్వామికత తాండ వించింది. భారతదేశంగా సగర్వంగా జరుపుకోవలసిన గణతంత్ర దినోత్సవం, విదేశాలను ఆహ్వానించిన భాగస్వామ్య సదస్సు ఇందుకు సందర్భాలు కావడం పరిస్థితికి ప్రతిబింబం. రాజ్యాంగ విలువలైన ప్రజాసామ్యం, రాష్ట్రాల హక్కులు, జాతుల గౌరవం వంటివాటిని అణగదొక్కజూస్తున్న ప్రభుత్వాలు దేశ విదేశీ భాగస్వాములకు తమ అసలు రూపం చూపించేందుకు ఇలా వ్యవహరించాయి. ఏది ఏమైనా మీకు, మాకు జోడీ చెడదని చెప్పదలచాయి. మరోవైపున ప్రజల ఆగ్రహాన్ని, ఆవేదనను, ఆరాటాన్ని అర్థం చేసుకోకపోగా అలక్ష్యం చేస్తూ రౌడీలు, గూండాలని ముద్ర వేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకూ, ఆయన వందిమాగధులకే దక్కుతుంది. తామే తుమ్మి చిరంజీవ అనుకున్నట్టు తమకు తామే హోదా ముగిసిపోయిన అధ్యాయమని ప్రకటించేసి ప్రజలకు కూడా ‘క్లారిట’ీ ఇచ్చామన్నారు. అది నిజం కాదన్న ‘క్లారిటీ’ ప్రజలకు ఉంది గనకే ఉద్యమానికి సిద్ధమయ్యారు. ప్రజలు రారనే ప్రభుత్వం అనుకుంటే అన్ని ఆంక్షల అవసరమే లేదు. అరెస్టులు చేయాల్సి వచ్చేదే కాదు. వారు నిందించినట్టు ఆందోళనకారులు రౌడీలు, గూండాలే అయితే భాగస్వామ్య సదస్సుకు సంబంధించి ముందూ వెనకా ఒక్క చిన్న ఘటనైనా లేకుండా అంత ప్రశాంతంగా ముగిసేదీ కాదు. ప్రజల్లో నిజంగా ఆ భావం లేకపోతే ఒకరి తర్వాత ఒకరుగా పోటీపడి ప్రత్యేక ప్యాకేజీపై అసత్యాలు వల్లించాల్సిన పనీ లేదు.

చరిత్రలో పరస్పర ప్రేరణ
జల్లికట్టుకూ, దీనికీ సంబంధమేమిటనే అపహాస్యంతో ఇది మొదలైంది. ఒక అమాత్యవర్యులైతే పందుల పందేల వరకూ వెళ్లారు. జల్లికట్టుపై విశ్లేషణ, వివేచన వేరు. కానీ వారు కలసికట్టుగా నిలిచిన తీరును చూసి మరో ఉద్యమానికి సిద్ధం కావడం వేరు. భారత స్వాతంత్య్ర పోరాట కాలం నుంచి నేటి వరకూ ఇలా ఒక సందర్భం మరో సంచలనానికి దారితీసిన ఉదాహరణలున్నాయి. టర్కీలో తమ ఖలీఫాను కూలదోశారని ముస్లింలు ఆవేదనకు గురై తీసుకొచ్చిన ఖిలాఫత్‌ ఉద్యమం భారత స్వాతంత్య్ర పోరాటంలో కొత్త మలుపు తెచ్చింది. ఐర్లాండులో డివేలరా నాయకత్వాన జరుగుతున్న అధినివేశ పోరాటం ఉన్నవ లక్ష్మీనారాయణ వంటివారిని ఉత్తేజపర్చింది. తిలక్‌ మహాశయుడు గణేశ ఉత్సవాలను జాతీయోద్యమ స్ఫూర్తి వైపు మలచాడు. ఒక పరిణామం ఎలా మొదలైనా సమాజానికి, సృజనశీలురకు మరో లక్ష్యసాధనకు ప్రేరణనివ్వడం తెలిసిన వారు పందుల పందేల గురించి మాట్లాడరు. ఆ మాటకొస్తే కోర్టులు నిషేధించిన కోడిపందేలలో పాలకపక్ష నేతలు నిస్సంకోచంగా పాల్గొన్నారని వారి అధినేతే ప్రకటించారు.

విశాఖ సరే.. విపరీతాలెన్నో చేశారే!
కనుక జగడం జల్లికట్టు గురించి కాదనీ జాతికట్టుగా మారడమే ఏలిన వారికి రుచించలేదని ఇక్కడ స్పష్టమవుతుంది. ఒకసారి ఈ ఆలోచనంటూ ప్రవేశించాక ఇప్పుడు ఏం జరిగినా మరో సారైనా ఇదే ఐక్యతా స్ఫూర్తి ముందుకు రావడం తథ్యమని వారికి తెలుసు. అందుకే ఉద్యమంపై నిర్బంధానికి పాల్పడ్డారు. రకరకాల సాకులతో దుష్ప్రచారం చేశారు. రిపబ్లిక్‌ డే, భాగస్వామ్య సదస్సు వంటివి సాకులు మాత్రమే. అదే నిజమైతే దివీస్‌ కంపెనీ ఆందోళన సమయంలో సిపిఎం కార్యదర్శి మధును అరెస్టు చేసి ఎన్ని స్టేషన్లు తిప్పారు? భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలోనూ ముందే ఎందుకు అరెస్టు చేశారు? ముఖ్యమంత్రి పర్యటనను సాకుగా చూపి కాకినాడలో సిపిఎం కార్యాలయాన్ని ముందే ఎందుకు చుట్టుము ట్టారు? రేపటి నుంచి శాసనసభ కోసం అమరావతిలోనే ఉండవలసిన ప్రతిపక్ష నేత జగన్‌ సందర్శనకు వెళితే రకరకాల దారులు ఎందుకు మార్పించారు? కాపు నేత ముద్రగడ పద్మనాభానికి అడుగడుగునా ఆటంకాలెందుకు కల్పిస్తున్నారు? ఏడాది కిందట తునిలో రైలు పెట్టె దహనం జరిగితే ఇంతవరకూ ఏం తేల్చారు? తునిలో అలా జరిగింది గనక ఇక ఎక్కడా ఏ నిరనసనూ అనుమతించబోమంటే ఎలా కుదురుతుంది? ఈ ద్వంద్వనీతి ఏం రాజనీతి? విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేతను రన్‌వేపై అడ్డుకుంటే ఆయన అక్కడే కూచున్నాడు. ఇందులో మొదటి భాగం దాటేసి రెండో భాగమే చెబితే సరిపోతుందా? జగన్‌ను లేదా వైసీపీని ఎంతగా విమర్శించినా ప్రతిపక్షంగా వారికి హక్కులుండవా? తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉంటే ఆందోళనలు చేయలేదా? ఒక్కరోజైనా చంద్రబాబు ఖాళీగా ఉన్నారా? విమానాశ్రయాలలో ఆయనా అలజడి సృష్టించారే? కనుక అసలు విషయం పక్కకు నెట్టి అనవసరమైన వాదనలు, ఆరోపణలు చేయడం అతితెలివి అవుతుంది.
జంటకవుల కొంటెమాటలు

ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటం చేస్తామని, రక్తం మరిగిపోయిందని అన్నది ముఖ్యమంత్రే. తర్వాత ప్యాకేజీ వచ్చింది గనక ఒప్పుకున్నామంటున్నారు. ఇది దాని కంటే మెరుగనీ అంటున్నారు. మళ్లీ అదే నోటితో చట్టబద్ధత రావలసి ఉందని చెబుతున్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడైతే అమలు చేయడం తప్ప చట్టబద్ధత అంటూ వేరే ఉండదని చప్పరించేస్తున్నారు. కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా ఇచ్చే ధోరణి లేదు గనకే తాము తగ్గాల్సి వచ్చిందని తెలుగుదేశం నేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతారు. తెలుగుదేశం తమను ఖాతరు చేయడం లేదు గనకే ఇలా చేస్తున్నామని బిజెపి నేతలు(ఒక వర్గంవారు) అంటారు. మోడీకి వెంకయ్య నాయుడంటే లక్ష్యం లేదు గనకే ఆయన మాటను కావాలని తోసిపుచ్చు తున్నారని ఆయన విమర్శకులంటారు. నేను చాలా పలుకుబడి గలవాణ్ణి గనకే 35 మంది మంత్రులను పిలిపించానని వెంకయ్య స్వోత్కర్ష చేసుకుంటారు. సరిలేరు నాకెవ్వరూ అని తనకు తానే కితాబులిచ్చుకుంటారు. ఏమైతేనేం ఇంతవరకూ హోదా, ప్యాకేజీ చట్టబద్ధత ఏ విషయంలోనూ మోడీ నోటి ముత్యాలు రాలింది లేదు! మోడీకన్నా మా నాయకుడు పెద్ద గనకనే ఈర్ష్యతో ఇలా చేస్తున్నాడని తెలుగుదేశం నేతలు చెవిలో చెబుతారు. వారి దాగుడుమూతలు ఎలా ఉన్నా ప్రజలు, ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుంటే అడ్డుపడటం, అణచివేత చర్యలకు పాల్పడటం అత్యంత దారుణం. అధికారం కోసం, కార్పొరేట్ల కాంట్రాక్టుల కోసం మీరు సర్దుకోవచ్చు గాని మీ వాగ్దానాలు నమ్మి ఓటేసిన ప్రజలను, వారిని సమీకరించే ప్రతిపక్షాలను నోరుమూసుకోవాలని హుంకరిస్తే చెల్లుబాటు కాదు.

ప్యాకేజీ ఒక అభూత కల్పన
ప్రత్యేక హోదాకు అవకాశం లేదనే మాట కొండంత అవాస్తవం. గతంలో గాని, ఇప్పుడు గాని దానికి సంబంధించిన ఎలాటి నిర్దిష్ట నిబంధనలూ సవరణలు రాజ్యాంగంలో లేవు. అప్పుడు అధికారంలో ఉన్నవారి నిర్ణయమే అంతిమం. ఇక హోదా వల్ల అదనంగా ఒరిగేది లేదన్న మాటకు చాలాసార్లు జవాబులు చెప్పు కున్నాం. సిపిఎం ఈ విషయమై ఒక పుస్తకమే ప్రచురించింది. ఆఖరికి కాగ్‌ డైరెక్టర్‌ జనరల్‌ గోవింద భట్టాచార్జీ హోదా విషయంలో లొసుగులను చెబుతూనే అదే లేకపోతే ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాలు అభివృద్ధి చెంది ఉండేవి కాదని స్పష్టంగా చెప్పారు. ప్రత్యేక పరిస్థితిలో విభజించిన ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంటు సాక్షిగా అందరం కలసి వాగ్దానం చేసిన ప్రత్యేక హోదాను అణాపైసలతో లెక్కకట్టి ప్యాకేజీ తాయిలంతో మురిపించడం చట్టసభలపై విశ్వాసాన్నే పోగొడుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైంది అరుణ్‌ జైట్లీ 2016 సెప్టెంబరులో మురిపించిన ప్యాకేజీ ఓ బూటకం. హోదా వల్ల వచ్చే ప్రయోజనాలన్నిటినీ నిర్దిష్టంగా లెక్కకట్టడం ఎవరి వల్లా కాదు. ఎంతమంది పెట్టుబడులతో వస్తారనేది ఎవరైనా ఎలా లెక్కిస్తారు? ఇకపోతే లెక్క వేయవలసిన రెవెన్యూ లోటు వంటివి కూడా ఇప్పటి వరకూ తేల్చలేదు. 2014-16 వరకూ తేల్చామంటున్నారు గాని దానిపైనా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. కానీ వెంకయ్య నాయుడు మాత్రం తాజాగా లోటు అన్నది ఇప్పుడు లేదని, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ పరుగులు పెడుతున్నదని(ఎబిఎన్‌ ఇంటర్వ్యూ) ఊదరగొడుతున్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన దాన్ని కనీసంగా నిదానంగా ఇవ్వడం తప్ప అవసరానికి తగినట్టు నిర్ణయించింది లేదు. అనివార్యంగా ప్రతి రాష్ట్రంలో పెట్టే ఐఐటి వంటి వాటి గురించి ఏదో దయాదాక్షిణ్యాలతో ఇచ్చినట్టు చెప్పుకోవడం తగనిపని. దమ్మున్న మీడియా ధిపతులు కూడా ఈ మాత్రానికే మురిసి పోయి ఇక కేంద్రంతో సఖ్యతలోనే మోక్ష ముందని ప్రబోధించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రత్యేక హోదా పోయి, ప్రత్యేక ప్యాకేజీ పోయి పోలవరంకు వచ్చిన వాటి గురించే-అది కూడా పరిమి తంగా-సరిపెట్టుకోవడం ఎలాటి తర్కం? పోనీ ఆ పోలవరంకైనా పోరాటాలు, కదలికలు లేకుండా తనుగా కేంద్రం ఇచ్చిందా? ప్రభుత్వం, ప్రతిపక్షాలు, ప్రజలు, మీడియా ఒక జట్టుగా ఉండి రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన హామీని అమలు చేయించుకోవాలి తప్ప కేంద్రంతో జట్టుకట్టి రాష్ట్ర ప్రజలపై కత్తికట్టడం కుటిలనీతి అవుతుంది. అందుకోసం అనేక అసత్య వాదనలు పుట్టించడం కుత్సితమవుతుంది. కేంద్రంలో వెంకయ్య పట్టు, పలుకుబడి అందుకు దారితీస్తే రాష్ట్రంలో చంద్రబాబు అవగాహన, అనుభవం దానికి వంతపాడుతుంటే ప్రజలు గ్రహించలేరనుకోవడం వివేకశూన్యతే. ఈ మలివంచనకు ఎలా, ఎప్పుడు బదులు చెప్పాలో వారికి తెలుసు.

4 Comments

Filed under Uncategorized

4 responses to “ఎపికి ప్రత్యేక వంచన-రెండో అధ్యాయం

  1. Ithara kulalanu vidagotti …..
    Rastranni KAMMA ga dochukuntunna Neethimalina jathi .

    http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=2621:2017-02-03-06-58-44&Itemid=665

    Use social media …….Expose these caste fanatics…..Save AP

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s