అమరావతి ‘దేశం’లో అయోమయం!

అమరావతి ‘దేశం’లో అయోమయం!
అమరావతి, ఫిబ్రవరి 3: మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుతో రాష్ట్ర రాజధాని నగరాలైన గుంటూరు-కృష్ణా జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నారు. పై స్థాయిలో ఎవరి దారి వారిదేనన్నట్లు వ్యవహరిస్తుండటంతో, తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అసహనంతో ఉన్నారు. చివరకు వీరి గోడు వెళ్లబోసుకునేందుకు రాష్ట్ర పార్టీ కార్యాలయం వేదికగా మారింది. గుంటూరు జిల్లాలో మంత్రులు-ఎమ్మెల్యేలు-ఎంపీల మధ్య ఎక్కడా సమన్వయం కనిపించడం లేదు. ఎవరి దారి వారిదేనన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు కోడెల మంత్రిగా ఉన్నప్పటి క్రమశిక్షణ ఇప్పుడు కనిపించడం లేదు. మంత్రులు పుల్లారావు, రావెలలో పుల్లారావే కొద్దిగా మెరుగ్గా పనిచేస్తున్నారంటున్నారు. రావెల సొంత నియోజకవర్గంలో తమను పట్టించుకోవడం లేదని, తమ మధ్య వర్గ విబేధాలు సృష్టిస్తున్నారంటూ తాజాగా ఆ నియోజకవర్గ నేతలు పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు ఫిర్యాదు చేశారు. రావెల పనితీరుతో కాపు, కమ్మ, ఎస్టీ వర్గాలు పూర్తిగా దూరమయ్యే పరిస్థితి నెలకొంది. అటు పుల్లారావు మంత్రిగా ఉన్నప్పటికీ నియోజకవర్గానికి ఎక్కువ సమయమే కేటాయిస్తున్నారు. అయితే, కుటుంబ పెత్తనానికి ఇంతవరకూ తెరదించకపోవడంతో ఆ ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ ఇటీవలి కాలంలో బలపడుతోంది. నర్సరావుపేటకు ఇంతవరకూ నియోజకవర్గ ఇన్చార్జిని అధికారికంగా ప్రకటించే పరిస్థితి లేకుండా పోయింది. దానిపై నిర్ణయం తీసుకునే సాహసం నాయకత్వం చేయలేకపోతోంది. అక్కడ సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్న స్పీకర్ కోడెల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆయన కుటుంబసభ్యులపైనా ఆరోపణలొస్తున్నాయి. ఎంపి రాయపాటి సాంబశివరావు తనకు ఆ రెండు నియోజకవర్గాల్లో స్థానం లేకుండా పోయిందంటూ ఇటీవల సత్తెనపల్లిలో జరిగిన ఒక సంఘటనను మీడియా ముందే బహిర్గతం చేశారు. నర్సరావుపేటకు తన సోదరుడైన రాయపాటి శ్రీనివాస్‌ను ఇన్చార్జిగా నియమించాలని ఆయన బాబును కోరుతున్నారు. రాయపాటి-కోడెల మధ్య పొసగడం లేదు. అయితే నియోజకవర్గంలో ఎమ్మెల్యేలంతా రాయపాటితో సన్నిహితంగా ఉండటం ప్రస్తావనార్హం. అయితే, రాయపాటి వ్యాఖ్యలను ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదని నేతల వ్యాఖ్యల బట్టి స్పష్టమవుతోంది.

ఇక గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై ఇటీవల కాలంలో మైనింగ్‌కు సంబంధించిన ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. జిల్లాలో జరిగే అన్ని పోలీసు బదిలీల వ్యవహారాలనూ ఆయనకే అప్పగించడంపై మిగిలిన ఎమ్మెల్యేలలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గుంటూరు ఎంపి జయదేవ్‌తో ఎమ్మెల్యేలకు పొసగడం లేదు. ఆయన ఎవరినీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆయన ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, అన్నీ పీఏల ద్వారానే చక్కబెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. గుంటూరు ఎమ్మెల్యే మోదుగులపై కమ్మ సామాజికవర్గం ఆగ్రహంతో ఉంది. ఆయన తన వర్గానికి చెందిన వైసీపీ నేతలకే పనులు చేస్తున్నారని ఫిర్యాదు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో మంత్రి దేవినేని ఉమ పెద్దన్న పాత్ర పోషిస్తూ అందరినీ అణచివేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. విజయవాడ ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, శ్రీరాం తాతయ్య, వల్లభనేని వంశీ, బొండా ఉమామహేశ్వర్‌రావు, కాగిత వెంకట్రావుతోపాటు, విజయవాడ మేయర్, కృష్ణా జిల్లా నేతలు కూడా మంత్రి ఒంటెత్తు పోకడలపై అసంతృప్తిగా ఉన్నారు. ఒక్క జలీల్‌ఖాన్ తప్ప వారంతా ఉమాకు వ్యతిరేకంగా ఉన్నారు. మిగిలిన వారిని ఎదగకుండా అణచివేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. మంత్రి కొల్లు రవీంద్ర వద్దకు జిల్లా అధికారులను వెళ్లనీయడం లేదని, అందుకే జిల్లా అధికారులెవరూ కొల్లు ఫోన్ చేసినా ఎత్తే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు. ఇటీవల నందిగామ ఎమ్మెల్యే సౌమ్యను సీఎం పిలిపిచి ఆమె పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సందర్భంలో తన నియోజకవర్గంలో అధికారులెవరూ తన మాట వినడం లేదని, దేవినేని ఆదేశాలే పాటిస్తున్నారని బాబు వద్ద వాపోయినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధికారులెవరినీ తమ వద్దకు వెళ్లనీయకుండా కట్టడి చేస్తున్నారన్న ఫిర్యాదులు ప్రజాప్రతినిధుల నుంచి వినిపిస్తున్నాయి. మరో మంత్రి కొల్లు రవీంద్ర తన నియోజకవర్గానికే పరిమితమవుతుండగా, మచిలీపట్నం ఎంపి నారాయణ అందరినీ సమన్వయం చేసుకుంటున్నారు.

కొన్ని నియోజకవర్గాల్లో అగ్రనేతలు సొంత పార్టీ వారి నుంచే డబ్బులు పిండుతున్నారన్న ఆరోపణలున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు సంపాదనలో పడి తమను వదిలేశారని, చిన్న చిన్న కాంట్రాక్టులు కూడా తమకు ఇవ్వకుండా కుటుంబసభ్యుల బినామీలతో చేయిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. గతంలో చిన్న కాంట్రాక్టులు కార్యకర్తలకే ఇచ్చేవారని, ఇప్పుడు అగ్రనేతల కుటుంబసభ్యులే చేసుకుంటున్నారని కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి వచ్చి వాపోతున్నారు. ఎవరేమనుకున్నా ఫర్వాలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టాం, మళ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టాం కాబట్టి సంపాదించాలన్న బేఖాతరు వైఖరి వల్ల తమతో పాటు, పార్టీ కూడా నష్టపోతోందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా గుంటూరు జిల్లాలో పార్టీ ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ప్రజల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నందున, అదే తమకు లాభిసతుందన్న వ్యూహంతో వైసీపీ స్థానిక రాజకీయాలు, కులసమీకరణలతో ప్రయత్నిస్తోంది. ప్రధానంగా గుంటూరు జిల్లాతోపాటు, విజయవాడ వెస్ట్, మైలవరం, నందిగామ నియోజకవర్గాలపై వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది.

http://andhrabhoomi.net/content/ap-3595

1 Comment

Filed under Uncategorized

One response to “అమరావతి ‘దేశం’లో అయోమయం!

 1. Veera

  లగడపాటి సర్వే
  UP లో బీజేపీ గెలుస్తుంది, AP లో పల్లె ప్రాంతాల్లో TDP బలం తగ్గి YCP బలం బాగా పెరిగింది, పట్టణాల్లో మాత్రం టీడీపీ YCP సమానంగా ఉన్నాయి
  [దేశంలో ఎన్ని ప్రామాణిక సర్వేలు ఉన్నా… తెలుగు వాడైన లగడపాటి సర్వేకు విశ్వసనీయత ఎక్కువ. ఇంతకాలం ఆయన సర్వేలు చెప్పిన నిజం కావడం ఈ విశ్వసనీయతకు కారణం. ఏపీ తెలంగాణ అయినా ఇతర రాష్ట్రాలు అయినా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఎవరికి బలం పెరిగిందో ఎవరికి మద్దతు తగ్గుతుందో కచ్చితంగా చెప్పగలగడం లగడపాటి ప్రత్యేకత. తాజాగా ఐదు రాష్ర్టాల ఎన్నికలపై ఆయన సర్వే చేయించి.. ఆ వివరాలు వెల్లడించారు.

  ఢిల్లీకి దగ్గరి దారి అని పేరున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుత పోరులో భారతీయ జనతా పార్టీ గెలుపు సాధిస్తుందని పేర్కొన్నారు. నోట్ల రద్దు ప్రభావంతో యూపీలో బీజేపీ విజయం సాధిస్తుందని లగడపాటి అభిప్రాయపడ్డారు. యూపీ ప్రజలు పెద్ద నోట్ల రద్దును స్వాగతించడం వల్ల ఎన్నికల్లో విజయానికి మార్గం సుగమం అయ్యిందని తెలిపారు. అధికార ఎస్పీలో ఉన్న కుటుంబ కలహాలు – బీఎస్పీ – కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం లేకపోవడం ఇందుకు కారణమని లగడపాటి విశ్లేషించారు. ఎన్నో ఏళ్లుగా అక్కడ అధికారంపై కన్నేసిన బీజేపీ చివరకు తన లక్ష్యాన్ని చేరుకునే రోజు దగ్గర పడిందన్నారు.

  ఇక ఏపీ రాజకీయాల గురించి కూడా ఆయన కొన్ని విషయాలు వెల్లడించారు. తన మధ్యంతర సర్వే అంచనాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బల పడగా – అధికార తెలుగుదేశం పార్టీ బలహీనపడుతోందన్నారు. స్థానిక తెలుగు దేశం నాయకుల వ్యవహార శైలి ఏపీలో అభివృద్ధి కార్యక్రమాల మందగమనం వీటికి కారణంగా లగడపాటి చెప్పుకొచ్చారు. పట్టణ ప్రాంతాల్లో మాత్రం అధికార టీడీపీ – వైసీపీలకు సమాన మద్దతు ఉందని విశ్లేషించారు. గతంలో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కనుమరుగైందని లగడపాటి వివరించారు. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే రాబోయే ఎన్నికల్లో ఏపీలో అధికారం కోసం గట్టి పోటీ ఉండేలా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇక తన రాజకీయ భవిష్యత్ పై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ తాను రాజకీయాలకు తెలుగు రాష్ట్రాలకూ దూరంగా ఉన్నట్లు లగడపాటి ప్రకటించారు.

  http://www.tupaki.com/politicalnews/article/Lagadapati-Rajagopal-Predictions-YSRCP-Strengthen-in-Andhra/149734

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s