MLC ఫలితాలు దేనికి సంకేతం? ఆంధ్రభూమి, March 26
ఏపి శాసనమండలిలో స్థానిక సంస్థలు, టీచర్లు, గ్రా డ్యుయేట్ల నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో వె లువడిన ఫలితాలు విభిన్న తీర్పులిచ్చాయి. స్థానిక సంస్థల నుంచి మూడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ గెలుపొందగా, ఆ పార్టీ మద్దతుతో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి బిజెపి విజయం సాధించింది.
మిగిలిన అన్ని స్థానాల్లో వైసీపీ, ఆ పార్టీ బలపరిచిన పిడిఎఫ్ అభ్యర్థులు సత్తా చాటారు. ఇవి చూడ్డానికి సాధారణ ఎన్నికల మాదిరి కనిపించినా పట్ట్భద్రులు, విద్యావంతులు, నిరుద్యోగులు నేరుగా పాల్గొని ఇచ్చిన తీర్పుగా గ్రహించాలి. అంటే 9 జిల్లాలకు చెందిన విద్యావంతులు ఈ ఎన్నికల్లో నేరుగా ఓటేశారన్నమాట. ఒకరకంగా రాష్ట్రంలో 60 శాతానికి పైగా జరిగిన ఎన్నికలివి. వీటిని శాంపిల్గానే భావించి తీరాలి.
పరిమిత సంఖ్యలో ఉండే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓట్లేసిన మూడు స్థానాల్లో తెదేపా గెలుపొందినా, విద్యావంతులు పాల్గొన్న ఎన్నికల్లో మాత్రం ప్రతిపక్షాలే విజయం సాధించడాన్ని ఇక్కడ విస్మరించకూడదు. ఇవి రానున్న నగర పాలక సంస్థల, మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలకు ఒక సంకేతమే. టీచర్స్, గ్రాడ్యుయేట్ల స్థానాల్లో తా ము ఎందుకు ఓడిపోయామో అధికార పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల స్థానంలో మిత్రపక్షమైన బిజెపి గెలిచినప్పటికీ, నైతికంగా అది బిజెపి వ్యక్తిగత ఖాతాలోకే వెళుతుంది.
అధికారంలో ఉన్నప్పటికీ మూడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి తెదేపా ఆర్థికంగా, రాజకీయంగా చాలా కష్టపడాల్సి వచ్చింది.
ఇక వైకాపా అధినేత జగన్కు జనంలో సదభిప్రాయం లేదని, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉన్నా జగన్, ఆయన పార్టీ బలం పెరగడం లేదంటూ బాబు చుట్టూ ఉన్న ఒక వర్గం గత ఏడాది నుంచీ చేస్తున్న మానసికానంద ప్రచారంలో డొల్లతనాన్ని, ఆత్మానందాన్నీ ఈ ఎన్నికల ఫలితాలు వెక్కిరిస్తున్నాయి. ‘మండలి’ ఎన్నికల్లో జగన్ ఎక్కడా ప్రచారం చేయలేదు. పిడిఎఫ్ అభ్యర్ధులకు మద్దతునిచ్చి, వారు పోటీ చేయని చోట వారి మద్దతు తీసుకున్నారంతే! చదువుకున్న వారంతా ప్రతిపక్షానికి జైకొట్టడాన్ని తక్కువ చేసి చూడలేం. ఎన్నికైన ప్రజాప్రతినిధులు వేసిన ఓట్లకు, నేరుగా ప్రజలు వేసిన ఓట్లకూ తేడా గమనించకుండా ఆ మూడు విజయాలపైనే ఎక్కువ మాట్లాడి, ప్రజలు నేరుగా ఇచ్చిన తీర్పును తక్కువ చేసి చూపితే, అది ఆత్మద్రోహం చేసుకోవడమే అవుతుంది
జగన్ విజయాన్ని తక్కువ చేయడం కూడా సబబు కాదు. ఆయన గత కొద్ది నెలల నుంచీ జనం మధ్యలో ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వాములవుతున్నారు. ఆ ఫలితాన్ని ఆయన మిత్రపక్షాలతో కలసి ఎన్నికల్లో అందుకున్నారు. ఇప్పటికైతే చదువుకున్న వాళ్లు జగన్ కావాలని కోరుకుంటున్నారు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా ఈ నిజాన్ని గుర్తించక తప్పదు! జనంలో జగన్ ఇమేజి పెరగడం లేదని, ఆయన పార్టీలో కుమ్ములాటలు పెరుగుతున్నాయని, ఆయన త్వరలో మోదీతో కలసిపోతారంటూ సొంత మీడియా కులపతులు చెప్పే భవిష్యవాణిలో ఏమాత్రం పస లేదని, తాజా తీర్పు స్పష్టం చేసిన తర్వాతయినా తెదేపా నాయకత్వం తీరు మారాలి.
స్థానిక సంస్థల విజయంపై జగన్ శిబిరంలో డీలా గురించి డప్పు కొట్టిన నయా రాజగురువులుం గారు, అదే సమయంలో జరిగిన టీచర్స్- గ్రాడ్యుయేట్ల ఎన్నికల్లో ప్రతిపక్షం సాధించిన విజయంపై వౌనం వహించినా, ప్రజలు వాటి గురించి మాట్లాడుకోవడం మానేయరు కదా? ఎందుకంటే ప్రపంచం విజేతల గురించే మాట్లాడుకుంటుంది. పొగడ్తలు తియ్యగా, విమర్శలు చేదుగా ఉంటాయి. ఆరోగ్యానికి ‘తీపి’ హానికరమన్న వాస్తవాన్ని నాయకత్వం ఎంత త్వరగా గుర్తిస్తే అంతమంచిది.