వ్యవసాయ రంగ వృద్ధి 21.2 శాతం వాస్తవమేనా బాబూ !
మత్య్స సంపద సాధించిన 42.09 శాతం వృద్ధిని కలుపుకొంటే ఇది సాధ్యపడింది. ప్రస్తుతం కోస్తా జిల్లాలు మొత్తం రొయ్యల కంపుతో గుభాళిస్తున్నాయి.
ఈ ప్రభుత్వం రొయ్యలు, చేపలు అమ్మగా వచ్చిన ఆదాయాన్ని వ్యవసాయ సంబంధిత ఆదాయంగా చూపించి మాయ చేసేందుకు ప్రయత్నిస్తోంది.
ముఖ్యమంత్రి జిల్లాను పరిశీలిద్దాం. చిత్తూరు జిల్లాలో 2014-15లో 46,838 హెక్టార్లలో చెరకు సాగు జరిగితే 2016-17 నాటికి 35,370 హెక్టార్లకు కుంచించుకు పోయింది. వాస్తవంలో చెరుకు సాగు ఒక్కటే రైతులకు గిట్టుబాటు ధర కల్పించే పంట. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే చిత్తూరు, రేణిగుంటలలో వున్న రెండు సహకార రంగ చక్కెర ఫ్యాక్టరీలు మూతబడ్డాయి.
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరి సాగు క్రమేణా పడిపోయింది. 2013-14లో ఖరీఫ్, రబీతో కలిపి 25.63 లక్షల హెక్టార్లలో సాగు జరిగితే 2016-17 నాటికి 20.27 లక్షల హెక్టార్లకు సాగు దిగిపోయింది.
రాష్ట్రంలో ప్రధానంగా సాగు జరిగే పంటల సేద్యపు విస్తీర్ణం ఒకవైపు పడిపోతుండగా మరో వైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకుండా పెట్టిన పెట్టుబడులు రుణంగా మారి రైతుల ఇంట మరణ మృదంగాలు మోగుతున్నాయి.
వాస్తవ పరిస్థితులు ఇలా వుంటే గణాంకాల ముఖ్యమంత్రిగా పేరుపొందిన చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పని చేస్తున్న ప్రణాళికా శాఖ … ఏ పంటల ద్వారా రైతులు లాభపడ్డారో … ప్రభుత్వానికి ఏ విధంగా లబ్ధి చేకూరిందో ప్రకటించి వుంటే బాగుండేది.
పైగా గతేడాది రాష్ట్రంలో 385 మండలాలను కరువు ప్రాంతంగా ప్రకటించడం గమనార్హం.
ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీన పార్లమెంటులో కేంద్ర ఆర్థిక సర్వే ప్రవేశ పెట్టారు. ఈ నివేదిక ప్రకారం 2016-17 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో చిన్న, సన్నకారు రైతులపై రూ.44,599 కోట్ల రుణ భారం వుంది. ఇందులో వ్యవస్థీకృత రంగం నుండి రూ.18,727 కోట్లు మాత్రమే రుణం పొందగా అనధీకృత (ప్రయివేటు) మార్గాల ద్వారా రైతులు రూ.25,872 కోట్లు రుణం పొందినట్లు ఈ నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని వర్గాల రైతులపై రూ.57,529 కోట్ల అప్పు వుంది.
ఈ గణాంకాలు పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం అమలు జరిపిన రైతు రుణమాఫీ పథకంలోని డొల్లతనం బహిర్గతమౌతుంది. రాష్ట్రంలో బ్యాంకులు, సహకార సంస్థల ద్వారా అతి స్వల్ప శాతం రైతులకు మాత్రమే రుణం లభిస్తుండగా ఎక్కువమంది రైతులు ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. అప్పు చేసి పంటలు సాగు చేసినా తుదకు గిట్టుబాటు ధరలు లేక అయిన కాడికి అమ్మేస్తున్నారు. పెట్టిన పెట్టుబడులు రుణంగా పరిణమించగా గత్యంతరం లేక వలస బాట పడుతున్నారు. అదీ కాకపోతే ఉరి కంబాలెక్కుతున్నారు. ఇది… వ్యవసాయ రంగంలో సాధించిన వృద్ధి!
– వి. శంకరయ్య , విశ్రాంత పాత్రికేయులు
ప్రజాశక్తి , Sep 27,2017
రైతుల చావుకేక-నెల వ్యవధిలో 22 మంది ఆత్మహత్య
ఒక్క గుంటూరు జిల్లాలోనే 8 మంది..
జూన్ నుంచి 148 మంది ఆత్మహత్య
ఎన్నికలకు ముందు కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడా ఊసే మరిచారు. కౌలు రైతులకు అప్పు పుట్టక వడ్డీ వ్యాపారులపై ఆధారపడుతున్నారు. దిగుబడి లేక, గిట్టుబాటు ధర రాక, అప్పు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన జూన్ నుంచి ఇప్పటివరకు 148 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
గుంటూరు జిల్లాలోనే అధికం…
గత నెలరోజుల వ్యవధిలో రాష్ట్రంలో 22 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో 8 మంది ఒక్క గుంటూరు జిల్లాకు చెందినవారు.
నాగార్జునసాగర్ కుడికాల్వ కింద ఆయకట్టుకు నాలుగేళ్లుగా నీళ్లు ఇవ్వకపోవడంతో రైతుల పరిస్థితి దుర్భరంగా తయారైంది.
రుణమాఫీ వర్తించకపోవడం, అప్పులిచ్చే విషయంలో బ్యాంకులు ముఖం చాటేయడంతో అధిక వడ్డీలకు అప్పు తెచ్చి పంటలేశారు. గిట్టుబాటు ధర లేక, అప్పుల ఊబి నుంచి బయటపడలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
గత 31 రోజుల్లో రాయలసీమలో ఏడుగురు, ఉత్తర కోస్తాలో ఇద్దరు, దక్షిణ కోస్తాలో 13 మంది చనిపోయారు.
జిల్లాలవారీగా చూస్తే అనంతపురంలో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు, గుంటూరులో 8 మంది, కర్నూలు, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, చిత్తూరు, వైఎస్సార్, తూర్పుగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కౌలు రైతులు ప్రాణాలు తీసుకున్నారు.
ఏ ఒక్క హామీ అమలు కాకనే…
రాష్ట్రంలో 30 లక్షల మందికిపైగా కౌలు రైతులున్నట్టు అనధికార అంచనా. రాష్ట్రప్రభుత్వం మాత్రం 16 లక్షల మంది ఉన్నట్టు గుర్తించి వీరిలో 11 లక్షల మందికి ఈ ఏడాది రుణఅర్హత పత్రాలు, సాగు ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని ప్రకటించింది. అయితే ఇందులో మూడో వంతు మందికి కూడా ఇవి అందలేదు.
రెవెన్యూ శాఖ 1,70,403 మందికి మాత్రమే రుణ అర్హత పత్రాలిచ్చింది. వ్యవసాయ శాఖ 72,893 మందికి సర్టిఫికెట్ ఆఫ్ కల్టివేషన్ కార్డులు ఇచ్చింది.
ఈ ఖరీఫ్ సీజన్‌లో 2,43,296 మందికి మాత్రమే బ్యాంకుల ద్వారా అది కూడా కేవలం 666.73 కోట్ల రుణం మంజూరైంది.
అయితే మొత్తం 16 లక్షల మంది కౌలుదారులకు కలపి రూ.5 వేల కోట్ల రుణాలు ఇవ్వాలన్న లక్ష్యమెక్కడ? ఇచ్చిన రుణాలు ఎక్కడ? ప్రభుత్వం చెబుతున్న రుణ లెక్కలపై రైతు సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కౌలు రైతులకు రూ.200 కోట్లకు మించి ఇవ్వలేదని, ప్రభుత్వం చెబుతున్నవి కాకిలెక్కలని ఆక్షేపిస్తున్నాయి.
రాష్ట్రప్రభుత్వం కౌలు రైతులకిస్తానన్న పంట రుణాలివ్వలేదని, వడ్డీ లేని, పావలావడ్డీ రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా చెల్లించాల్సిన నగదు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతోందని మండిపడుతున్నాయి. మొత్తం పంట రుణాల్లో పది శాతానికిపైగా కౌలుదారులకు ఇవ్వాల్సి ఉండగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు మాత్రం కేవలం 0.45 శాతమే ఇస్తున్నాయని ఆరోపిస్తున్నాయి.
-సాక్షి , Sep 27,2017