చంద్రబాబు గ్రాఫ్ నేలచూపులు
గత ఎన్నికల నాటి ఓటు బ్యాంకులో భారీ కోత
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ‘గ్రాఫ్’ శరవేగంగా పడిపోతుందా?. అంటే అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు సైతం.
గత నెల రోజుల వరకూ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధిస్తామనే ధీమా టీడీపీ నేతలు..పార్టీ శ్రేణుల్లో ఉండేది. కానీ ఆకస్మాత్తుగా చోటుచేసుకున్న పరిణామాలు టీడీపీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తున్నాయి.
‘ప్రత్యేక హోదా’ విషయంలో చంద్రబాబు నాలుగేళ్ల పాటు రకరకాల మాటలు మార్చి…చివరి నిమిషంలో మళ్లీ ‘ప్రత్యేక హోదా’ అందుకున్న తీరు చూసి ఏపీ ప్రజల్లో..ముఖ్యంగా తటస్థులను తీవ్ర అసంతృప్తిని గురిచేసింది. చాలా మంది ఈ విషయాన్ని బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు కూడా.
దీని కంటే అత్యంత కీలకమైన అంశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరిగ్గా నెల రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు. ముఖ్యంగా చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ పై చేసిన అవినీతి ఆరోపణలు ఏపీలో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. అంతే కాదు..అప్పటివరకూ చంద్రబాబును సమర్థిస్తూ వచ్చిన పవన్ తీరును తప్పుపట్టిన వారిలో చాలా మంది ఆవిర్భావ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలతో ఆయన వైపు మారిపోయారు.
గత ఎన్నికల్లో కేవలం చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందని మద్దతు ఇచ్చానని..కానీ ఆయన అనుభవం ఏ మాత్రం పనిచేయలేదని పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టేసి మరీ చెప్పారు. పవన్ కళ్యాణ్ తనకు కులాలు..మతాలు..ప్రాంతాల పట్ల పట్టింపులేదని..తాను అందరివాడినని చెబుతున్నారు. ఆయన ఏమి అనుకుంటున్నా ఏపీలో ముఖ్యంగా కాపు సామాజిక వర్గం అంతా ప్రస్తుతం పవన్ వైపునకు పూర్తిగా మారిందని టీడీపీ నేతలు సైతం అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. గత ఎన్నికల్లో వీరంతా చంద్రబాబుకే మద్దతు ప్రకటించారు. అందుకు పవన్ కళ్యాణ్ కూడా ఓ కారణం. ఈ లెక్కన చూస్తే చంద్రబాబుకు గత ఎన్నికల్లో ఉపయోగపడిన 10 శాతం ఓటు బ్యాంకు నికరంగా దూరం అయినట్లే.
ఏపీ మొత్తంలో కాపు సామాజిక వర్గం జనాభా 12 నుంచి 14 శాతం వరకూ ఉంటుందని అంచనా. దీనికితోడు గత ఎన్నికల్లో చంద్రబాబుకు అప్పట్లో మోడీపై ఉన్న ఇమేజ్ చాలా ఉపయోగపడింది. అయితే ఇప్పుడు ఏపీలో ప్రధాని మోడీ ఇమేజ్ ఏమీలేకపోయినా గత ఎన్నికల్లో కలిసొచ్చిన ఈ ఓటు బ్యాంకు చంద్రబాబుకు దూరమైనట్లే.
అయితే గత ఎన్నికల్లో తాము సొంతంగానే గెలిచామని చంద్రబాబు..టీడీపీ నేతలు ఇప్పుడు చెప్పుకుంటున్నా అసలు విషయం ఏమిటో అందరికీ తెలిసిందే. అంటే ఈ లెక్కన చంద్రబాబుకు గత ఎన్నికల్లో సహకరించిన సామాజిక వర్గాలపరంగా ఉన్న 10 శాతం పైగా ఓటు బ్యాంకు దూరమైనట్లే.
గత ఎన్నికల్లో చంద్రబాబు అత్తెసరు ఓట్ల తేడాతోనే అధికారం దక్కించుకున్నారు. దీనికి తోడు రాజధాని అమరావతిలో కాంట్రాక్ట్ ల దోపిడీ తప్ప..రాజధాని నిర్మాణం అడుగు ముందుకు పడకపోవటం…ఏపీలో పెచ్చరిల్లిన ప్రభుత్వ అవినీతి మరికొంత నష్టం చేయటం ఖాయం.
ఈ లెక్కన చూస్తే చంద్రబాబుకు రాబోయేది అత్యంత గడ్డుకాలమే అని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. తాజా పరిణామాలు చంద్రబాబుకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
http://telugugateway.com/2018/04/chandrababu-graph-down-fastly-in-andhra-pradesh/