తిరుమలలో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టిన రమణ దీక్షితులు
(మొన్న దుర్గగుడిలో క్షుద్ర పూజలు జరిగాయి , 1995 నుంచి 2014 వరకు బాబు CM గా ఉన్నారు
దుర్గగుడిలో క్షుద్రపూజలు..టీటీడీ పోటులో తవ్వకాలు!
ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన దేవాలయాల్లో అసలు ఏమి జరుగుతోంది. గతంలో ఎన్నడూలేని రీతిలో ప్రధాన దేవాలయాలు అన్నీ ఎందుకు వివాదాల్లో చిక్కు కుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం విజయవాడలో కనకదుర్గ ఆలయంలో జరిగిన క్షుద్రపూజల వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. అక్కడ తప్పు జరిగినట్లు ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా తేల్చింది. కానీ తప్పు చేసిన వారిపై చర్యలు కరవు.
దేవాలయానికి ఏ మాత్రం సంబంధంలేని వారు అర్థరాత్రి గుడిలోకి ప్రవేశించి ఎలా పూజలు చేస్తారు..అక్కడ జరిగిన వ్యవహారం అంతా కూడా ‘రాజకీయ ప్రయోజనాల’ కోసం చేశారనే విమర్శలూ వెల్లువెత్తాయి. దుర్గగుడిలో అర్థరాత్రి పూట జరిగిన క్షుద్రపూజలకు సంబంధించిన వ్యవహారం సీసీటీవీల్లో కూడా రికార్డు అయింది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఎంతో పేరున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో చోటుచేసుకుంటున్న పరిణామాలు భక్తులను మనోవేధనకు గురిచేసేవే. తిరుమలలో స్వామివారికి ప్రసాదాలు తయారుచేసే పోటులో ‘ఆభరణాల’ కోసం అని తవ్వకాలు జరిపారంటూ దేవాలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఈవోకు కూడా తెలియకుండా పోటులో తవ్వకాలు చేపట్టాల్సిన అవసరం ఏముంది? అని రమణదీక్షితుల ప్రశ్న.
అంతే కాదు…భక్తులు అందజేసే విలువైన బంగారు కానుకల్లో కొన్నింటిని కరిగించారనే ప్రచారం కూడా జరుగుతోంది. అసలు ఆ అవసరం ఎందుకొచ్చింది అన్నది టీటీడీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. విలువైన ఆభరణాల గల్లంతు అవుతున్నాయని రమణదీక్షితులు ఆరోపిస్తున్నారు. గతంలో ఎన్నడూలేని రీతిలో కోట్ల మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న టీటీడీ వ్యవహారం ఇప్పుడు భక్తుల్లో ఆందోళన రేపుతోంది)
రమణదీక్షితులు గారు చెప్పిన విషయాలు …..
స్వామి వారి ఆభరణాల గురించి పూర్తిగా తెలిసిన నలుగురు ప్రధాన అర్చకులను తొలగిస్తే ఇక అడిగే వారే ఉండరన్న ఉద్దేశంతోనే తమను హఠాత్తుగా తొలగించారని టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు వ్యాఖ్యానించారు.
1996లో మిరాశీ వ్యవస్థ రద్దు అయిన తర్వాత ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని.. అప్పటి నుంచి లెక్కలేకుండా పోయిందన్నారు. 1996 తర్వాత ఎన్ని వజ్రావైడుర్యాలు మాయమైపోయాయో చెప్పలేని పరిస్థితి వచ్చిందన్నారు.
ఇటీవల శ్రీవారి పోటును మరమ్మతుల పేరుతో 25 రోజుల పాటు మూసివేశారని రమణదీక్షితులు ఆవేదన చెందారు. పోటు మరమ్మతు పేరుతో తవ్వకాలు జరిపారన్నారు. మరమ్మతుల కోసం వంటశాలను తవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. నిధుల కోసం తవ్వారా లేక నేలమాళిగల కోసం తవ్వకాలు జరిపారా అన్నది తేలాలన్నారు. ఈ తవ్వకాల విషయం ఈవోకు కూడా చెప్పకుండా ఎందుకు చేశారని నిలదీశారు.
మైసూర్ మహారాజు ఇచ్చిన వందల కోట్ల విలువైన వజ్రం మాయమైపోతే పట్టించుకున్న వారే లేరన్నారు. ఇటీవల అది జెనివాలో వేలానికి వచ్చిందని ఆంగ్ల పత్రికల్లో వచ్చిన కథనాలను మీడియా సమావేశంలో చూపించారు. భక్తులు విసిరిన నాణాలకు వజ్రం ఎలా పగిలిపోతుందని రమణదీక్షితులు ప్రశ్నించారు.
ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిన నివేదిక ప్రకారమే మాయమైన పింక్ డైమండ్ ఖరీదు కొన్ని వందల కోట్లు అని రమణదీక్షితులు సదరు రిపోర్టులను చూపించారు. 2001 నాడు గరుడసేవలో మాయమైన పింక్ వజ్రం దేశం దాటిపోయిందన్న మాటకు తాను కట్టుబడే ఉన్నానన్నారు. మాయమైన వజ్రం చిన్నసైజుదేమీ కాదని.. ఒకవేళ నిజంగా పగిలిపోయి ఉంటే దాని ముక్కలైనా చూపించాలన్నారు.
న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తికి వజ్రాల గురించి ఏం తెలుస్తుందని రమణదీక్షితులు ప్రశ్నించారు. వజ్రాల సంగతి తేలాలంటే వజ్రాల నిపుణులతోనే విచారణ జరిపించాలన్నారు. శ్రీవారికి మహారాజులు సమర్పించిన విలువైన పాత నగలు అలంకరణకు ఎందుకు రావడం లేదని రమణదీక్షితులు ప్రశ్నించారు.
మాయమైపోయిన వజ్రాలు, ఆభరణాలపై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. టీటీడీ చర్యల వల్ల స్వామివారి తేజస్సు తగ్గిపోతోందని రమణదీక్షితులు ఆందోళన వ్యక్తం చేశారు. స్వామివారి తేజస్సు తగ్గిపోతే భక్తులకు అనుగ్రహం లభించదన్నారు. స్వామి వారి వద్ద ఇనుప వస్తువులు వాడకూడదని.. కానీ వాటినే వాడుతున్నారన్ని రమణదీక్షితులు చెప్పారు. ఇనుముకు ఉన్న అయస్కాంత శక్తి వల్ల స్వామివారి తేజస్సు తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని ఎంతో మంది అధికారులకు తాను చెప్పినా ఎవరూ పట్టించుకోలేదన్నారు.
వెయ్యికాళ్ల మండపం తొలగించివద్దని చాలా సార్లు చెప్పానన్నారు. కనీసం మరొక చోటైనా అదే రీతిలో నిర్మించాలని కోరానన్నారు. కానీ వినకుండా తొలగించారన్నారు. చివరకు స్వామివారికి రథమండపం కూడా లేకుండా చేశారన్నారు. ప్రతి ఆలయానికి రథమండపం ఉందని.. ఒక్క తిరుమలేశుడికి మాత్రమే రథమండపం లేకుండా చేశారన్నారు. కొండపై జరిగిన అన్ని విషయాలపై సీబీఐ విచారణ జరిపిస్తే అన్ని బయటకు వస్తాయని రమణదీక్షితులు అభిప్రాయపడ్డారు. స్వామిసన్నిధిలోనే తాము నిస్సాహాయులుగా ఉండిపోవాల్సి వచ్చిందని… అందుకే ఆలయ రక్షణ కోసం మీడియా ముందుకు, భక్తుల ముందుకు రావాల్సి వచ్చిందన్నారు.