తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆస్తులపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మ 2,424 పేజీల పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ప్రకటించిన ఆస్తుల వివరాలు పూర్తిగా అద్దం అని ఆమె తెలిపారు. దేశవిదేశాలలో చంద్రబాబు పేరన ఉన్న ఆస్తుల వివరాలు, బీనామీ పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలు అందులో తెలిపారు. టిడిపి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు వేల కోట్ల రూపాయలు సంపాదించినట్లు పేర్కొన్నారు. అతని ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె కోరారు.
18 అంశాలలో చంద్రబాదు అధికార దుర్వినియోగానికి, అక్రమాలకు పాల్పడినట్లు ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ పేర్ల మీద పెట్టిన అక్రమ ఆస్తుల వివరాలు తెలిపారు. చివరకు తల్లి పేరుతో కూడా ఆయన సాగించిన అక్రమాల వివరాలను వెల్లడించారు. సింగపూర్లో బీనామీ పేరు మీద కొనుగోలు చేసిన హొటల్ వివరాలను కూడా అందులో పొందుపరిచారు. చంద్రబాబు బీనామీలుగా వ్యవహరిస్తూ సుజనా చౌదరి, సిఎం రమేష్ విదేశాల నుంచి తరలించిన నిధుల వివరాలు తెలిపారు. నెల్లూరు జిల్లా బాలాయిపల్లెలో చంద్రబాబుకు చెందిన వ్యవసాయ భూముల వివరాలు అన్నింటినీ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కేవలం రెండు ఎకరాలు ఉన్న చంద్రబాబు అనేక అక్రమ మార్గాలలో వేల కోట్ల రూపాయలు సంపాదించిన తీరుని వివరించారు.