అనంతపురం: మానవత్వమే తన కులం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు ఆయన రాయదుర్గం నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పదేపదే తన కులం, మతం గురించి మాట్లాడుతున్నారని, మానవత్వమే తన కులం అని, పేదలకు మెరుగైన సేవలు అందించాలన్న తపనే తన మతం అన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హంద్రీనీవాకు 4వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని చెప్పారు. ఆయన మరణం తరువాత హంద్రీనీవాకు వంద కోట్ల రూపాయలు కూడా వెచ్చించలేదన్నారు.
స్వర్ణయుగం వస్తుందని, అప్పుడు ఎలా బతకాలో ఆలోచించాల్సిన అవసరం అక్కాచెల్లెళ్లకు ఉండదన్నారు. బడికి వెళ్లే విద్యార్థులందరికీ 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ప్రతి పాఠశాలలో ఆంగ్ల విద్యను ప్రవేశపెడతామన్నారు. వృద్ధుల పింఛను 200 రూపాయల నుంచి 700 రూపాయలకు పెంచుతామని చెప్పారు.
బోయ, కురుబ కులస్తుల స్థితిగతులు తనకు తెలుసన్నారు. అనంతపురం, హిందూపురం లోక్సభ స్థానాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రెండు కులస్తులకు టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. వాల్మికులను ఎస్టి జాబితాలో చేర్చేందుకు కృషిచేస్తామని, సువర్ణయుగం వస్తే కేంద్రానికి తీర్మానం పంపుతామని చెప్పారు.